దేశంలో కశ్మీర్, తెలంగాణ ప్రత్యేకమని.. అందరితో పాటు స్వాతంత్రం రాలేదని.. బలవంతంగా కలుపుకున్నారని గతంలో కేసీఆర్ కుమార్తె కవిత ఎంపీగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. తర్వాత మర్చిపోయారు. కానీ ఇప్పుడు రాజకీయ పరిణామాల్లో కేసీఆర్ అలాంటి భావనను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకుటున్నారు. దేశంతో పాటు తెలంగాణకు స్వాతంత్రం రాలేదని.. విలీనం చేసినప్పుడే స్వాతంత్ర్యం వచ్చిందని భావిస్తూ.. ప్రత్యేకంగా తెలంగాణ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఈ మేరకు కొంత మంది మేధావులు ఆయను కలిసి విజ్ఞప్తి చేసినట్లుగా టీఆర్ఎస్ అనుకూల మీడియా చెబుతోంది. ఇప్పటికే స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను కేసీఆర్ కేంద్రంతో సంబంధం లేకుండా ఘనంగా నిర్వహించారు. ఎంత నిర్వహించినా.. దేశ భక్తి అనే కాన్సెప్ట్ బీజేపీకి పెటెంట్‌గా మారింది. అదే సమయంలో తెలంగాణ అనేది టీఆర్ఎస్కు పేటెంట్ లాంటిది కాబట్టి ఆ సెంటిమెంట్‌ను మరింత పెంచుకునేలా భిన్నమైన కార్యక్రమాలు రూపొందించాలని భావించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణకు ప్రత్యేకంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
నిజానికి నైజాంను ఇండియాలో సైనిక చర్య ద్వారా విలీనం చేశారు. ఇది విలీనమా.. విద్రోహమా.. మరొకటా అనేదానిపై రాజకీయ పార్టీల మధ్య అభిప్రాయభేదాలున్నాయి. విలీనం దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని టీఆర్ఎస్ ఉద్యమ సమయంలో పట్టుబట్టింది. అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయింది. కానీ బీజేపీ మాత్రం చేయాలంటోంది. అయితే అసలు ఈ వివాదం కన్నా.. తెలంగాణకు అప్పుడే స్వాతంత్ర్యం వచ్చిందని ఘనంగా వేడుకలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.