మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది..! మద్యం ధరలను ఒకేసారి 10 శాతం పెంచేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. సీసాల సామర్థ్యాన్ని బట్టీ బీరుపై రూ. 20 నుంచి రూ. 40 పెరుగుతోంది. లిక్కర్ మీద రూ. 20 నుంచి రూ. 100 వరకూ పెరుగుదల ఉంటుంది. పాపులర్ లిక్కర్ బ్రాండ్లపై భారీగా ధరలు పెరగబోతున్నాయి. ఉన్నట్టుండి ఇప్పుడు పెంచడం వల్ల సర్కారు భారీ ఎత్తున లాభం వస్తుంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలున్నాయి, దానికంటే మేజర్ ఈవెంట్ నూతన సంవత్సర వేడుకలున్నాయి కదా. పెరిగిన మద్యం ధరల ప్రభావం సామాన్య, మధ్య తరగతి తాగుబోతులపై భారీగానే పడుతుంది. అబ్బే, మరీ అంత భారమేం కాదులెండీ, ఆంధ్రాతో పోల్చుకుంటే మన దగ్గర బాగా తక్కువే పెంచామని అధికారులు అంటున్నారు. లాభం ఎవరికంటే, రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ ధరల పెంపకం ద్వారా ప్రతీ నెలా దాదాపు రూ. 350 కోట్ల అదనపు ఆదాయం ఖజానాకి చేరుతుంది.
గడచిన ఐదేళ్లుగా చూసుకుంటే… రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారానే భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది. గత ఐదేళ్లలోనే మద్యం రాబడి 4 రెట్లు పెరిగిందనేది అంచనా. తెలంగాణ ఏర్పడ్డ మొదట్లో ఎక్సైజ్ డ్యూటీ రూ. 3 వేల కోట్ల దాకా ఉండేది. ఈ ఏడాది ముగిసే సమయానికి ఈ ఆదాయం రూ. 12 వేల కోట్లకు చేరుతుందనేవి అధికార వర్గాల్లో ఉన్న అంచనాలు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక బాగులేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెబుతున్నారు. కేంద్రం ఇవ్వాల్సిన పన్నుల వాటా సొమ్ము ఇవ్వలేదనీ, ఆర్థిక మాంద్య పరిస్థితుల ప్రభావం రాష్ట్రంపై పడిందనీ అంటున్నారు. ఎలా చూసుకున్నా ప్రస్తుతం రాష్ట్రానికి ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం పెద్దగా లేకుండా పోయింది. మందు బాబులపై ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నపళంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచగలిగే శక్తి ఒక్క మద్యానికే ఉందనేది వాస్తవం. అందుకే, హుటాహుటిన పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఆదాయం పెంచుకునేందుకు మద్యం మినహా వేరే మార్గాలు లేవా అంటే, రిజిస్ట్రేషన్ల రుసుము పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం భూముల ధరలపై 5.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుము వసూలు చేస్తున్నారు. దీన్ని మరో 1.5 శాతం పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుకోవాలంటే… మందు బాబులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. మద్యం ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు కావడం గర్వించదగ్గ విషయమా..? ఇతర ఆదాయ మార్గాలు పెంచుకోలేని ప్రభుత్వ వైఫల్యమా..?