మహారాష్ట్రలో పరిస్థితి చూసి తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకునే ఆలోచన సీరియస్గా చేస్తోంది. ఓ వైపు కరోనా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న డీఎంహెచ్వో … జాగ్రత్తగా ఉండకపోతే.. .మహారాష్ట్ర లాంటి పరిస్థితులు ఏర్పడతాయని.. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకవని హెచ్చరికలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల వెనుక అసలు కారణం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్… ప్రస్తుత పరిస్థితుల్లో కట్టడి చర్యలు తీసుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. కొన్ని చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
అన్ని శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అంతిమంగా కరోనా కట్టడికి ప్రజలపై ఎలాంటి ఆంక్షలు పెట్టాలో డిసైడ్ చేయనున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే పరిస్థితే లేదని.. సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాక్ డౌన్ పెడితే.. చాలా మంది ప్రజల ఆర్థిక జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. ఎక్కువగా చిరు వ్యాపారులు.. దినసరి కూలీలు ఇబ్బంది పడతారు. ఇతర ఆర్థిక వ్యవస్థ కూడా అచేతనంగా మారుతుంది. అలాంటి పరిస్థితి రాకూండా ఉండాలంటే.. ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
హైకోర్టు కూడా ఇటీవలి విచారణలో కొన్ని కీలకమైన సూచనలు చేసింది. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకున్న వారికి మాత్రమే తెలంగాణలో అనుమతి ఇవ్వడంతో పాటు… ఇతర చర్యలనూ సూచించింది. ఇప్పటికే స్కూళ్లను మూత వేసి… బార్లు, సినిమాహాళ్లకు చాన్సివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటినీ తట్టుకోవడానికి కేసీఆర్… కొన్ని ఆంక్షల దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారులతో సమీక్ష పూర్తయిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో కేసీఆర్ తీసుకునే ఆంక్షలేమిటన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.