తెలంగాణ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్ , చత్తీస్గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను.. ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో నవంబర్ 12వ తేదీన నోటిపకేషన్ విడుదలవుతుంది. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరగుతుంది. ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. అన్ని రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 11వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. చత్తీస్ గఢ్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్, మిజోరంలలో ఒకే విడతగా నవంబర్ 28న, రాజస్తాన్, తెలంగాణలో ఒకే విడతగా డిసెంబర్ ఏడో తేదీన పోలింగ్ జరుగుతుంది.
తెలంగాణలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నదానిపై శుక్రవారం వరకూ పెద్దగా అనుమానాల్లేవు. అయితే ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత శశిధర్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు డైరక్షన్ మేరకు.. హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల అభ్యంతరాలకు పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాతే ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఆదేశించింది. అంతకంటే ముందే హైకోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. దీనికి ఎనిమిదో తేదీ వరకూ గడువు ఇచ్చారు. అంటే.. సోమవారం. ఆ లోపే.. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు నిర్ణయాన్ని అనుసరించే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే.. అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించి.. తప్పుల్లేని ఓటర్ల జాబితా సిద్ధం చేశామని .. హైకోర్టు ఆ మేరకు.. క్లారిటీ ఇచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు విడుదల చేసింది షెడ్యూల్ మాత్రమేనని ఈసీ చెబుతోంది. పన్నెండో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు. నిజానికి… కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణలో పర్యటించాల్సి ఉంది.
దీనికి సంబంధించి రేపో మాపో అధికార బృందం వస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అలాంటి బృందమేదీ రాకుండానే.. షెడ్యూల్ ను ప్రకటించేశారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ విదేశి పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో హడావుడిగా ప్రకటించారని భావిస్తున్నారు. కొద్ది రోజలుగా పోలింగ్ తేదీలపై మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతూనే ఉంది. దీన్ని బట్టే . కేసీఆర్… ఎన్నికల సంఘాన్ని మ్యానేజ్ చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ నేత శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఈసీ విశ్వసనీయతనే ప్రశ్నించారు. ఆ సమయంలో.. ఈసీ ఇలాంటి వార్తా కథనాలన్నీ తప్పు అని ప్రకటించింది. కానీ దాదాపుగా తేదీలను రిలీజ్ చేసింది. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన నెల రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రిలీజయింది.