కొబ్బరిచెట్టు ఎందుకు ఎక్కావురా అని వెనకటికి ఒకడ్ని నిలదీస్తే… దూడ గడ్డి కోసం అన్నాడట! కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలోకి ఆకర్షిస్తున్న తీరుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన మాట కూడా అచ్చంగా ఇలానే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద గెలిచిన ఎమ్మెల్యేలకే నమ్మకం పోయిందనీ, అందుకే పార్టీకి దూరంగా ఉండాలని చూస్తున్నారని తలసాని చెప్పారు. 2004 తరువాత తెరాస ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకున్నారనీ, అదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఇప్పుడు ఫిరాయింపులపై మాట్లాడుతున్న దద్దమ్మలే అప్పుడూ ఉన్నారని తలసాని ఎద్దేవా చేశారు. ఈ పనికిరాని, చేతగాని దద్దమ్మలు.. ఆరోజు పార్టీ ఫిరాయింపులు తప్పనీ, తెరాస వారిని చేర్చుకోవడం తప్పిదమని ఎందుకు మాట్లాడలేదు దద్దమ్మలారా అని ప్రశ్నించారు..? మీకు చేతనైతే రాష్ట్రంలో తిరగండి పనికిమాలిన చేతగాని దద్దమ్మలారా… అంటూ పదేపదే తిడుతూ మాట్లాడారు!
రాజ్యాంగమంటే వీళ్ల ఇంట్లోనే పుట్టినట్టు, గాంధీ భవన్ లోనే పుట్టినట్టు, వేరేవాళ్లకు తెల్వనట్టు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పై తలసాని విమర్శలు చేశారు. కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. సేవ చేయాలంటే, తెరాసలో ఉంటేనే చెయ్యొచ్చు అనే నమ్మకంతోనే… ఒక విశాలమైన దృక్పథంతో వస్తున్నారే తప్ప… డబ్బుల కోసమో పదవుల కోసమో కాదని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పడం జరిగింది! సేవ అంటే ఈ ప్రభుత్వం వల్ల, కేసీఆర్ నాయకత్వం వల్ల మాత్రమే జరుగుతుందన్న విశ్వాసంతో వస్తున్నారని చెప్పారు!
జంప్ జిలానీలకు ఇంతటి విశాల దృక్పథం ఉంటుందని మంత్రి తలసాని చెబుతుంటే హాస్యాస్పదంగా ఉంది! అందుకే, తెరాస విశాల హృదయంతో అందర్నీ అక్కున చేర్చుకుంటోందన్నమాట! అలాంటప్పుడు, సీఎల్పీ విలీనం కోసం తెరాస ఎందుకు ప్రయత్నాలు చేస్తోంది? ఇందులో ఉన్న ప్రజాసేవా కోణం ఏంటబ్బా..? అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమంటూ లేకుండా చేయాలనే లక్ష్యంతో ఎందుకు పనిచేస్తోంది..? డబ్బూ పదవీ ఆశించకుండా ప్రజల పట్ల అత్యంత ప్రేమాభిమానాలతో బాధ్యతతో సేవ చేసుకునేందుకు పార్టీ మారుతున్న సదరు నాయకులతో రాజీనామాలు ఎందుకు చేయించడం లేదు? వారిపై స్పీకర్ ఎందుకు అనర్హత వేటు వేయడం లేదు? ఒకపక్క ఫిరాయింపుల్ని నిర్లజ్జగా నీతిబాహ్యంగా ప్రోత్సహిస్తూ, చట్టసభలో ప్రతిపక్షం కూడా ఉండాలనే ప్రజాస్వామ్య నియమాలకు తూట్లు పొడుస్తూ… మళ్లీ ప్రజాస్వామ్యం గురించి తలసాని లాంటివాళ్లు లెక్చర్లు ఇస్తుంటే… సగటు పౌరుడికి ఎలా అనిపిస్తుంది..? రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ తెరాస నాయకులు చేస్తున్న సేవ ఏదీ..? రెవెన్యూ, పంచాయతీ, ఇంటర్ బోర్డు… ఇలా ఒక్కో వ్యవస్థా భ్రష్టుపట్టిపోయిందంటే ఎవరి సేవల ఫలితం ఇది..?