తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారంగా మారిపోయింది.ఈ విషయాన్ని ఆర్బీఐ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అంటే 2014-15లో 29,288 కోట్లు ఇప్పుడు 2020-21లో ఆదాయం 85,300కోట్లు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి నుంచి ఏడేళ్లలో జీఎస్డీపీ ఏకంగా 117 శాతం వృద్ధి నమోదు చేసింది. ఐటీ, ఐటీ అనుబంధ సేవలు, ఔషధ రంగ పరిశ్రమలతోపాటు వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనూ అద్భుత వృద్ధి సాధించింది. సొంత పన్నులు, పన్నేతర ఆదాయం సైతం భారీగా పెరిగింది. ఐటీ, తయారీ, పారిశ్రామిక, వ్యవసాయ, మైనింగ్ రంగాలు గణనీయ వృద్ధి సాధించడంతో ఖజానాకు రాబడి పెరిగింది. 2014-15తో పోల్చితే.. 2020-21 నాటికి పన్నేతర ఆదాయం 474 శాతం, పన్నుల ఆదాయం 291 శాతం పెరిగింది.
ఏడేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలు గణనీయంగా వృద్ధిని నమోదు చేయడంతో.. రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటితో పోలిస్తే మూడింతలకుపైగా రాబడి వృద్ధి నమో దైంది. పన్నుల రాబడితోపాటు పన్నేతర ఆదాయాన్నీ ప్రభుత్వం పెంచుకోగలిగింది. ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు కూడా మూడింతలు పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధిలో రాష్ట్రం మెరుగైన పనితీరు ప్రదర్శించింది. వరి, పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశ సగటుకన్నా 3, 4 రెట్లకుపైగా వృద్ధి నమోదయింది.
పెరిగిన ఆదాయానికి తగ్గట్లుగా తెలంగాణ ప్రభుత్వం అప్పులు కూడా చేసింది. 2021 మార్చి నాటికి రూ.2,52,325 కోట్లకు చేరాయి. ఆరేళ్లలో రూ. 1 లక్షా 80వేల కోట్ల వరకూ అప్పులు చేశారు. కానీ పెరిగిన ఆదాయంతో పోలిస్తే ఈ అప్పు పెద్ద భారం ఏమీ కాదు. అప్పులతో కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టడంతో అప్పులకు తగ్గ సంపద సృష్టి జరిగింది.