తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయాలకు వాడుకోని అంశమంటూ ఉండటం లేదు. తాజాగా తెలంగాణకు రెండూ వేర్వేరుగా స్వాతంత్ర్య దినోత్సవాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి . రెండూ అధికారికంగానే నిర్వహించబోతున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అన్ని సంస్థానాలు విలీనం కాలేదు హైదరాబాద్ సంస్థానం కూడా విలీనం కాలేదు. కొన్ని నెలల తర్వాత నిజాంపై సైనిక చర్యకు దిగి మిగిలిన పని పూర్తి చేశారు. ఆ విలీనం జరిగి ఈ సెప్టెంబరు 17వ తేదీకి 74 ఏళ్లు పూర్తవుతాయి. 75వ సంవత్సరం వస్తుంది. అందుకే తెలంగాణ విలీన వజ్రోత్సవాలను నిర్వహించాలని భావిస్తున్నారు.
సెప్టెంబరు 17ను విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. ఉద్యమంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ చేయడం లేదు. దీన్నే చాన్స్ గా తీసుకున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏడాదిపాటు వజ్రోత్సవాలు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. పటేల్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకున్న బీజేపీ.. ఆయన వల్లనే హైదరాబాద్ సంస్థానం విలీనం కావడంతో మరింత తెలంగాణ విలీన వజ్రోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
కేంద్రం ఆలోచనల గురించి తెలిసిన వెంటనే కేసీఆర్ కూడా ఇదే తరహా ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాలని నిర్ణయించారు. అజాదీకా అమృత్ మహోత్సవ్‌ను కేంద్రంతో పోటీగా చేసిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ విలీనాన్ని కూడా అలాగే చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర సాంస్కృతిక, హోం మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తెలంగాణ సర్కార్ తమ శాఖల ఆధ్వర్యంలో వేడుకలు చేయనుంది.
వజ్రోత్సవాలను అమిత్ షా హైదరాబాద్‌లో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై, ఏక్నాథ్ షిండే హాజరవుతారు. ఎందుకంటే నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలు జిల్లాలు ఉండడంతో విమోచన దినోత్సవాల్లో వారిని కూడా భాగస్వాములను చేస్తున్నారు. మరి అత్యధిక ప్రాంతానికి సీఎంగా ఉన్న కేసీఆర్ హాజరవుతారో లేదో స్పష్టత లేదు. సొంతంగా నిర్వహించాలనుకుంటున్నందున హాజరయ్యే చాన్స్ లేదని భావిస్తున్నారు. ఎవరు ఎలాంటి ఉత్సవాల రాజకీయాలు చేసినా ప్రజల సొమ్మునే ఖర్చు చేయాల్సి ఉంటుంది.