తెలంగాణలోకి వెళ్లాలంటే వీసాలు తెచ్చుకోవాలని ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టారు . ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ పాలనలో అదే నిజం అవుతోంది. నాడు విద్యార్థులని.. మొన్న అంబులెన్సుల్ని కూడా తెలంగాణలోకి అడుగు పెట్టకుండా కేసీఆర్ సర్కార్ అడ్డం పడింది. ఇప్పుడు వరి ధాన్యం లారీలను అడ్డుకుంటున్నారు. నిన్నటి నుంచి కర్నూలు జిల్లా నుంచి తెలంగాణ వెళ్లే వరి ధాన్యం లారీలను తెలంగాణ పోలీసులు కర్నూలు శివారులోని పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద ఆపేశారు. దీంతో వరి ధాన్యం లారీ లోడ్లు జాతీయ రహదారిపై నిలిచి పోయాయి.
ఎందుకు పంపించడం లేదంటే.. ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలున్నాయని చెబుతున్నారు. దీంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలాంటి ప్రకటన లేకుండా ఎలా ఆపేస్తారని లారీ డ్రైవర్ లు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఏపి నుంచి వచ్చే వరి ధాన్యంను కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ సియం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి తెలంగాణ మిల్లర్లు పెద్ద ఎత్తున ధాన్యం కొంటున్నారు. వారు తెలంగాణ రైతుల ధాన్యం కొనడం లేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.
పెళ్లిళ్లకు .. ఇతర రాజకీయాల విషయంలో సీఎం జగన్, కేసీఆర్‌తో బాగుంటారు. కానీ ఇలాంటి ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో ఆయన ఎప్పుడూ సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. విద్యార్థులైనా.. చివరికి నిమిషాలు లెక్కబెట్టే పేషంట్లను తీసుకెళ్లే అంబులెన్స్‌ల విషయంలోనూ జగన్ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు రైతుల కోసమైనా ఆయన కేసీఆర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని ఎవరూ అనుకోవడం లేదు. దొరికితే వీసా తీసుకోవడం లేకపోతే.. ఎవరి తిప్పలు వారు పడటం ఏపీ ప్రజలకు అలవాటయిపోయింది.