ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చెందిన వ్యక్తుల్ని ఓటర్లుగా చేర్చిన వ్యవహారం కృష్ణాజిల్లాలో బయటపడటం కలకలం రేపుతోంది. కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో తెలంగాణాలోని ఖమ్మం జిల్లాకు చెందిన వారికి ఓటు హక్కు కల్పించారు. తమ ఓటర్ల జాబితాలో వేరే వారి పేర్లు ఉండటం ఏమిటని ఆశ్చర్య పోయిన గ్రామస్తులు నేరుగా తహశీల్దార్ వద్దకు వెళ్లారు. తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దీనిపై వెంటనే తహశీల్దార్ విచారణ చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్లను పిలిపించి ప్రశ్నించారు. అసలు ఆ ఓట్లు ఎలావచ్చాయో తమకు తెలియనే తెలియదని వారు చెప్పడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే దీనిపై విచారణ ప్రారంభించారు. కొత్త ఓట్లు స్థానిక బీఎల్వోకి తెలియకుండా ఎలా వచ్చాయన్నదానిపై విచారణ ప్రారంభించారు.
టీడీపీని ఓడించడానికి, వైసీపీ ని గెలిపించడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఓటర్లు ఏపీలో నివాసం ఉండకపోయినప్పటికీ నమోదు చేసుకుంటూండటం కలకలం రేపుతోంది. సరిహద్దు నియోజకవర్గాలన్నింటిలో పొరుగు రాష్ట్రానికి చెందిన ఓటర్లను చేర్చారని తెలుగుదేశం హైకమాండ్ భావిస్తోంది. కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలోని సరిహద్దు గ్రామాలలో నల్గొండ జిల్లాకు చెందిన నందిగామ, తిరువూరు నియోజకవర్గాలలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓట్లను చేర్చారని, కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. అదే విధంగా గుంటూరు, కర్నూలు జిల్లాల్లో, పశ్చిమగోదావరిజిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో ఇటువంటి ఓటర్ల చేర్పులు ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు. వీటిపై వెంటనే అప్రమత్తం కావాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సమాచారం పంపింది.
మరో వైపు పోలీసులు ఫాం 7 దరఖాస్తుల పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూండటంతో ఇవి పూర్తిగా తగ్గిపోయాయి. రాష్ట్రంలో ఫాం 7 దరఖాస్తుల రగడ పై కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆరా తీసింది. ఫాం 7 దరఖాస్తులలో అక్రమంగా చేసిన వారిలో ఎవరు ఎక్కువుగా ఉన్నారని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ అడిగి తెలుసుకుంది. ఈ దరఖాస్తుల పరిశీలన మరో నాలుగైదు రోజులలో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి విడతగా 1 లక్షా 61 వేల 5 దరఖాస్తులను పరిశీలించిన ఎన్నికల సంఘం అందులో అసలైనవి 5 వేల 309గా తేల్చింది. మిగతావి దురుద్దేశ పూర్వకంగా వచ్చిన ఫాం 7 ధరఖాస్తులుగా గుర్తించింది. నకిలి దరఖాస్తులు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసుల విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించారు.