కృష్ణా రివర్ బోర్డు మీటింగ్లాగే.. గోదావరి రివర్ బోర్డు మీటింగ్ కూడా… ఎవరి వాదనలు వారు వినిపించుకోవడంతో ముగిసింది. అయితే.. తెలంగాణ అధికారులు.. తమ ప్రాజెక్టులు కొత్తవి కాదని వాదించడానికి.. ఎక్కువ సమయం కేటాయించారు. అలాగే.. ఏపీ సర్కార్ పట్టి సీమ ద్వారా గోదావరి నీటిని ఎత్తి పోసుకుంటోందని.. ఆ నీటి వాటాల సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు. గోదావరిపై తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై ఆంధ్ర ఫిర్యాదులు చేయడంతో. . ఆ అంశంపైనే ఎక్కువ చర్చ జరిగింది. కాళేశ్వరం, తుమ్మడిహట్టి కొత్త ప్రాజెక్టులు కాదని… తెలంగాణ తరపున వాదనలు వినిపించిన రజత్ కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణకు రావాల్సిన వాటా ప్రకారమే.. గోదావరి నీటిని ఎత్తి పోసుకుంటున్నామని.. తెలంగాణకు గోదావరి బేసిన్లో 967 టీఎంసీల వాటా ఉందని రజత్ కుమార్ స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లో టెలిమెట్రీల ఏర్పాటుపై అభ్యంతరాలు లేవని.. సాంకేతిక సమస్యలపై కమిటీ వేయాలని కోరినట్లు రజత్ కుమార్ చెప్పారు. గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వియంలో డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని.. గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ప్రకటించారు. ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వడానికి అంగీకరించాయన్నారు. త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనుంది.. ఎజెండా ఇవ్వాలని కోరినట్లుగా అయ్యర్ తెలిపారు.
పట్టిసీమ నీరు విషయంలో.. తెలంగాణ వాదనపై ఏపీ అధికారులు ఎలా స్పందించారన్న విషయం బయటకు తెలియలేదు. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం. పట్టిసీమ ద్వారా వాడుకున్న నీరు పోలవరం ద్వారా వాడుకున్నట్లే. గతంలో కేంద్ర జలవనరుల శాఖ కూడా… పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమని చెప్పింది. ఈ కారణంగానే… పట్టిసీమ ద్వారా ఎత్తిపోసుకునే నీటి విషయంలో ఇతర రాష్ట్రాలకు అభ్యంతరాలు అక్కర్లేదని.. ఏపీ కేటాయింపుల్లో భాగంగానే వాటిని తరలించుకుంటున్నామని వాదిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా అదే వాదన వినిపించి ఉంటారని భావిస్తున్నారు.