నీళ్లు, నిధులు, నియామకాలు… వీటి కోసమే తెలంగాణ అంటూ ఉద్యమం సాగించి, ఆ తరువాత అధికారంలోకి వచ్చింది తెరాస. ముఖ్యమంత్రి అయిన తరువాత నీళ్ల విషయంలో… అంటే, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్కారు బాగానే కృషి చేస్తోందనీ, కొత్త ప్రాజెక్టులు వేగంగా నిర్మించే ప్రయత్నం చేస్తోందనీ చెప్పొచ్చు. ఇక, నిధుల విషయంలో కూడా.. విభజన తరువాత తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉండటం, కేంద్రం నుంచి రాజకీయంగా కూడా ఎలాంటి సమస్యలూ లేకపోవడంతో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. మూడోది.. నియామకాలు. ఈ విషయంలో కేసీఆర్ సర్కారుపై ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రం వచ్చాక ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలు వచ్చేస్తాయంటూ యువతను నమ్మించారనీ, ఉద్యమాలు చేయించారని విపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ విమర్శలకు కూడా కేసీఆర్ సమర్థవంతంగా చెక్ పెట్టేయగలరనడంలో సందేహం లేదు!
తెలంగాణ కొత్త జోనల్ విధానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఏడు కొత్త జోన్లు, రెండు మల్టీ జోన్లకు ఆమోదం తెలుపుతూ ఇవాళ్ల గెజిట్ లో నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ఢిల్లీ పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో జోన్ల అవశ్యకతను కేంద్రానికి వివరించి, నియామకాల విషయంలో దీని ప్రాధాన్యత ఎంత ఉందో కేంద్రానికి స్పష్టం చేయడంతో కొత్త విధానికి మార్గం సుగమం అయిందని చెప్పుకోవచ్చు.
దీన్ని తమ ప్రభుత్వ విజయంగా కేసీఆర్ చెప్పుకుంటారనడంలో సందేహం లేదు. ప్రగతి నివేదన సభలో ఇదే ప్రధానమైన టాపిక్ అవుతుంది. అంతేకాదు, ఇదే వేదిక మీద నుంచి కొన్ని ఉద్యోగాల నియామక ప్రకటనలు చేసే అవకాశమూ ఉందనేది కూడా స్పష్టమైపోయింది. దాదాపు మరో నలభై వేల ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన ప్రకటనలు చేసే అవకాశం ఉందనే కథనాలు ఈ మధ్య వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల ప్రకటన చేస్తే… తెలంగాణ యువత నుంచి తెరాసకు అనూహ్య స్పందన వచ్చే అవకాశం ఉంది. ఇది కేసీఆర్ సర్కారు విజయం అనడంలో సందేహం లేదు.
ఇంకోటి… తెలంగాణ విషయంలో కేంద్రం కూడా ఈ మధ్య అత్యంత సానుకూలంగా, వేగవంతంగా స్పందిస్తూ ఉండటం గమనార్హం! కేసీఆర్ తన ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాలను పక్కనపెట్టడం, కేసీఆర్ కు అడిగినప్పుడల్లా ప్రధాని అపాయింట్మెంట్లు ఇస్తూ ఉండటం… దీంతో తెరాసతో ఒక స్నేహపూరిత వాతావరణాన్ని భాజపా ఏర్పాటు చేసుకుంటోందన్న అభిప్రాయం కలిగించేలా సంబంధాలు మారాయి. ఈ పరిస్థితుల్లో జోనల్ వ్యవస్థకు కేసీఆర్ ఆమోద ముద్ర వేయించుకోవడం విశేషం.