తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 20 నుంచి సమావేశాలు మొదలవుతాయి. ఈసారి మహారాష్ట్రతో జల ఒప్పందం ప్రధానాంశం అయ్యే అవకాశం ఉంది.
సమావేశాలను 10 పనిదినాల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరువు, మహా ఒప్పందం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మహా ఒప్పందంపై కేసీఆర్ ప్రభుత్వం సంబరాలు చేసుకోవడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. గోదావరిపై 152 మీటర్ల ఎత్తుకు తగ్గకూడదనే చిరకాల వైఖరికి తెరాస ప్రభుత్వం చరమగీతం పాడిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం కోరుకున్న విధంగా ఒప్పందం కుదుర్చుకుని సంబరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. 148 మీటర్లకు ఒప్పకోవడమంటే తెలంగాణ ప్రయోజనలకు విఘాతమేనని విపక్షాలన్నీ విమర్శిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఎవరి వాదన వాళ్లే వినిపించారు. ముఖాముఖి ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం జరగలేదు.
అసెంబ్లీలో అలా కాదు. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకే చోట ఉంటారు. ఎవరి వాదన వాళ్లు వినిపిస్తారు. ఇంతకీ ఎవరు చెప్పేది నిజమో ప్రజలు అర్థం చేసుకోవడానికి అవకాశం రావచ్చు. ప్రభుత్వం చెప్పినట్టు ఈ ఒప్పందం తెలంగాణకు వరమే అయితే సభలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు కూడా తమ వాదన ఏ విధంగా సరైందో సభలోనే వివరిస్తాయి. వాదోపవాదాలు, ఆవేశకావేశాలు తప్పక పోవచ్చు. ప్రతిపక్ష సభ్యుల సంఖ్య తగ్గినా, కీలకమైన అంశంపై గట్టిగా తమ వాణిని వినిపించే వాళ్లు ఇంకా ఉన్నారు. కాబట్టి వారి వాదనను పాలక పక్షం ఎదుర్కోవాల్సి ఉంటుంది.