తెలంగాణ ఉద్యమానికి మేధావులు పెద్ద అండదండ అని విభజనకు పూర్వం తరచూ వినిపించిన మాట.నిజంగానే వారు ఆ విధమైన పూర్తి విశ్వాసంతో పనిచేశారు. నాటి ప్రభుత్వాన్ని ధిక్కరించారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీరిలో అత్యధికులు అధికార చట్రంలో ఇమిడిపోయారు. శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన బిసి కమిషన్ చైర్మన్‌గా బిఎస్ రాములు,జూలూరి గౌరీశంకర్, ఆంజనేయులుగౌడ్, గతంలోనూ ఈ కమిషన్‌లో వుండి బాగా పనిచేసిన వకుళాభరణం కృష్ణమోహన్‌లు సభ్యులయ్యారు.అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, మల్లెపల్లి లక్ష్మయ్య, విఠల్, నిరంజన్ రెడ్డి వంటివారంతా రకరకాల పదవుల్లో ప్రభుత్వ బాధ్యతల్లో నియమితులైనారు. ఇంకా వివిధ కమిషన్లు ఎంఎల్‌సి పదవులు వంటివాటిలోనూ ఉద్యమ కాలపు ప్రతినిధులు చోటు సంపాదించారు. ఇప్పటికి పదవి రాని వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. పేర్లు కూడా చెప్పొచ్చు. అయితే దాని వల్ల వారికి నష్టం తప్ప లాభం వుండదు. నమ్మకంతో వుంటే ముందో వెనకో ఏదో ఒక లాభం చేకూరుతుంది తప్ప బయిటపడితే మొదటికే మోసం అని వీరంతా భావిస్తున్నారు. అయితే ఇంత మంది పదవుల్లో వుండిపోవడం వల్ల కలిగిన ఒక ఫలితం ఏమంటే ఎవరూ ప్రభుత్వాన్ని కనీసంగా విమర్శించలేని స్థితి ఏర్పడింది. పైగా టంకశాల అశోక్ వంటివారైతే అప్పుడే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్న రీతిలో సూత్రీకరణలే చేస్తున్నారు.
ఈ మొత్తం ఒరవడికి భిన్నంగా వున్నది జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, మరో ప్రొఫెసర్ హరగోపాల్ వంటి వారు మాత్రమే. అందులోనూ గతంలో వలెనే ఇప్పుడు కూడా గట్టిగా విమర్శించే కోదండరాంపై టిఆర్ఎస్ నేతలు చాలా గుర్రుగా వున్నారు. మొదట్లో ఆయనపై విమర్శలు చేసి కొంత సర్దుకున్న మంత్రి హరీష్ రావు ఇప్పుడు బాహాటంగానే విరుచుకుపడ్డారు. కోదండరాం చేసేది కాంగ్రెష్ పథకాలకే తోడ్పడుతుందని ఆరోపించారు. గౌరవం పోగొట్టుకోవద్దని సలహా ఇచ్చారు. దీనిపై ఏదో చర్చలో నన్ను అడిగినప్పుడు రైతుల కోసం మాట్లాడితే కోదండరాం గౌరవం పెరుగుతుందే గాని తగ్గదని చెప్పాను. అన్నట్టు ఆయన రైతు జెఎసి తరపున జరిగిన ధర్నాకు కె.రామచంద్రమూర్తి, శ్రీనివాసరెడ్డి,పొత్తూరి వెంకటేశ్వరరావు వంటి పాత్రికేయ ప్రముఖులు మద్దతు తెల్పడం విశేషం. ఆహ్వానం వున్నా నేను వెళ్లలేకపోయాను గాని చర్చల్లో పూర్తి మద్దతు తెలిపాను. వివిధ రంగాల్లో ఈ తరహా కార్యాచరణలు పెరిగే అవకాశమే కనిపిస్తున్నది. కెసిఆర్ పదవీ పంపకాలు ఈ ప్రతిపక్షాలు ప్రజా సంఘాల కార్యాచరణను ఆపలేకపోవచ్చు.