తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల కోడ్ ముగియడంతో పెండింగ్ హామీలను అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీపై కసరత్తు చేస్తుండగా తాజాగా మరో హామీని అమలు చేసే పనిలో పడింది సర్కార్.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. మహాలక్ష్మి స్కీమ్ లో పొందుపరిచిన వాటిలో ఈ హామీ ఒక్కటే పెండింగ్ లో ఉండటంతో దీనిపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇటీవల ఈ అంశంపై మంత్రి సీతక్క కూడా కీలక ప్రకటన చేశారు.
అర్హులైన మహిళలందరి ఖాతాలో 2500 జమ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజా పాలన కింద దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటిని వెరిఫై చేసి అర్హులైన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు సీతక్క ప్రకటనతో తేలింది.
త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్కీమ్ తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికీ మాత్రమే వర్తింపజేయనుంది. కుటుంబంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం, ఫించన్ పొందని వారికి ఈ పథకం వర్తింపజేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సాధ్యమైనంత త్వరగా ఈ హామీని నెరవేర్చాలని భావిస్తోన్న ప్రభుత్వం… బడ్జెట్ లో ఈ పథకానికి నిధులు కేటాయించి ఆగస్ట్ నుంచి అమలు చేసే అవకాశం ఉంది.