ప్రజల ఆకాంక్షలను ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ది పొందడం.. గెలిచిన తర్వాత… అలాంటి చాన్సే లేదని చెప్పడం.. బీజేపీకి అలవాటుగా మారింది. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ చేసిన మోసం.. ప్రజల కళ్ల ముందు ఉంది. తాజాగా.. ఆ పరిస్థితి తెలంగాణలోని పసుపు రైతులకు ఏర్పడింది. పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు పసుపు రైతులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనను గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకు వస్తానని ఆయన ఓటర్లకు బాండ్ రాసిచ్చారు. దాన్నే ఎన్నికల సమయంలో ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేసి మరీ ప్రచారం చేశారు.
ఎన్నికల సమయంలో పసుపు రైతుల ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది. అలాంటి సమయంలో అరవింద్ ఇచ్చిన హామీ ఆయనను గెలుపు తీరాలకు చేర్చింది. ఆయన కోసం ప్రచారానికి వచ్చిన బీజేపీ దిగ్గజాలు కూడా అదే హామీ ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత బోర్డు తేలేకపోయారు. అంతా సైలెంటయిపోయారు. ఇటీవల స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. అదే పసుపుబోర్డు కంటే పెద్దదన్నట్లుగా హడావుడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు తిప్పికొట్టారు. ఇప్పటికీ… నిజామాబాద్ ఎంపీ .. పసుపు బోర్డు వస్తదనే చెబుతూ ఉంటారు.
కానీ అలాంటి ప్రతిపాదనేదీ లేదని కేంద్రం చెబుతోంది. తాను పసుపుబోర్డు తీసుకు రాకపోతే… రాజీనామా చేస్తానని నాడు అరవింద్ సవాల్ చేశారు. ఇప్పుడు ఆయన దాన్ని నిలబెట్టుకోవాలని రైతులు కూడా కోరుతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు హామీలను నెరవేరుస్తామని ఓట్లు వేయించుకుని ఇప్పుడు డొంక తిరుగుడు కబుర్లు చెప్పడం బీజేపీ నేతలకు అలవాటయిపోయిందన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.