ఈ నెల 30న కొలువుల కోట్లాట సభకు జేయేసీ ఛైర్మన్ కోదండరామ్ సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ సభ నిర్వహణకు కావాల్సిన అనుమతులపై కొన్ని అనుమానాలు వ్యక్తమౌతున్న తరుణంలో.. కోర్టు ఆదేశాల ప్రకారమే సభ జరుపుతామని కోదండరామ్ చెబుతున్నారు. చాపకింద నీరులా తాను చేయాల్సిన పనుల్ని కోదండరామ్ ఒక్కోటిగా చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. గడచిన కొన్ని నెలలుగా ‘అమరవీరుల స్ఫూర్తి యాత్ర’ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాసమస్యలు తెలుసుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ఈ యాత్రను మొదలుపెట్టారు. అయితే, ఈ యాత్రను ప్రారంభంలో అధికార పార్టీ కాస్త లైట్ గానే తీసుకుంది. కానీ, దీనికి ప్రజాదరణ పెరగడంతో ఇటీవల వరంగల్ యాత్ర విషయానికి వచ్చేసరికి… అనుమతులు అంటూ కొత్త చర్చ తెరమీదికి వచ్చింది. ఈ పరిణామాల పర్యవసానం ఏంటంటే… జేయేసీ రూపాంతరం చెందే దశకు వచ్చేసిందని చెప్పడం!
నిజానికి, తెలంగాణ జేయేసీ ఓ కొత్త రాజకీయ పార్టీగా మారుతుందనే ఊహాగానాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. దీనిపై కోదండరామ్ ఇన్నాళ్లూ సూటిగా స్పష్టంగా స్పందించింది లేదు. కానీ, తాజాగా ఆయన స్పందనలో క్లారిటీ కనిపిస్తోంది. రాజకీయ పార్టీ ఏర్పాటుపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ ఇప్పుడు చెబుతున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ఒత్తిడి జేయేసీ శ్రేణుల నుంచీ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా త్వరలోనే ఆయన నిర్ణయం ఉంటుందని జేయేసీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. సో… పార్టీ ఏర్పాటుకు కావాల్సిన సానుకూల వాతావరణం ఏర్పడిందనే చెప్పొచ్చు.
అయితే, జేయేసీ పార్టీగా మారితే కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ ముఖచిత్రంలో కొన్ని మార్పులూ చేర్పులూ చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా తెరాస-కాంగ్రెస్ లు మాత్రమే తలపడే పరిస్థితి కనిపిస్తోంది. భాజపా, టీడీపీలు కలిసి ముందుకు సాగే అవకాశం తక్కువే. విడివిడిగా ఎవరిదారి వారు చూసుకున్నా ఏ ఒక్క పార్టీకీ సొంతంగా నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా అవతరించేంత ప్రజాదరణ ప్రస్తుతానికి లేదు. ఈ నేపథ్యంలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా కొత్త పార్టీకి అవకాశం ఉందా అనేదే అసలు ప్రశ్న..? సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం చూసుకున్నా రెడ్లంతా కోదండరామ్ కు మద్దతు పలుకుతారని ఆ మధ్య అనుకున్నారు. రెడ్ల ఐకమత్యంపై రేవంత్ రెడ్డి కూడా గతంలో బాగానే మాట్లాడేవారు. కానీ, ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లిన తరువాత ఈ టాపిక్ వదిలేశారు. నిజానికి, కుల ప్రాతిపదిక పార్టీలు ఏర్పాటు కావుగానీ.. ఏదో ఒక రూపంలో సంఘటితమైన ప్రజాదరణ రాజకీయ పార్టీలకు అవసరం కదా! ఈ పరిస్థితుల మధ్య జేయేసీ రాజకీయ పార్టీగా మారితే ఎలా నిలదొక్కుకుని మనుగడ సాగిస్తుందనేది వేచి చూడాలి.