హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు కొత్త మలుపు తిరిగింది. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనమేరకు తాము కొన్ని ఫోన్లను ట్యాప్ చేసినట్లు టెలికామ్ కంపెనీలు ప్రకటించాయి. కాల్ డేటా విషయమై ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఎయిర్టెల్, ఐడియా, రిలయెన్స్ టెలికామ్ సంస్థలు, అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్లలో ట్యాపింగ్ చేసిన విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాయి. ఈ ఏడాది మే – జూన్ నెలల్లో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్వారు తమకు కొన్ని ఫోన్ నంబర్లను ఇచ్చి ఆ నంబర్లను ఉపయోగించేవారి సంభాషణలను రికార్డ్ చేయవలసిందంటూ భారత టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5ను ఉదహరిస్తూ కోరారని టెలికామ్ సంస్థలు పిటిషన్లో తెలిపాయి. అయితే ఆ ట్యాపింగ్ ఇరు రాష్ట్రాలమధ్య రాజకీయ సంక్షోభం సృష్టించటంతో తాము ఇరుక్కుపోయామని సంస్థలు సుప్రీం కోర్టుకు వెల్లడించాయి.
రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ వద్దకు వెళ్ళటం తదితర పరిణామాలన్నీ మే 28-31మధ్య జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ మూడు టెలికామ్ సంస్థలనూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాల్ డేటా ఇవ్వాలని కోరటం, దానిని విజయవాడ కోర్టు సమర్థించటం, ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు బెదిరించటం సంగతి విదితమే. దీనిపైనే ఆ టెలికామ్ సంస్థలు సుప్రీం కోర్టుకు వెళ్ళాయి.