తెలంగాణా న్యాయమూర్తుల సంఘం హైదరాబాద్ లో నిన్న సమావేశమయ్యి రెండు తీర్మానాలు ఆమోదించింది. తమ సంఘం తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి వ్యవహరించినందుకు 11మంది న్యాయమూర్తులపై హైకోర్టు సస్పెన్షన్ విదించినందుకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక తీర్మానం ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. టాకూర్ అభ్యర్ధనని గౌరవిస్తూ న్యాయమూర్తులు అందరూ తక్షణమే తమ శలవులని రద్దు చేసుకొని మళ్ళీ విధులకి హాజరవ్వాలని మరొక తీర్మానం చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి మాటకి గౌరవమిచ్చి మళ్ళీ విధులలో చేరాలని తెలంగాణా న్యాయమూర్తులు నిర్ణయించుకోవడం చాలా మంచి నిర్ణయం. అభినందనీయం. కానీ తెలంగాణా న్యాయవాదులు ఇంకా సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. తమ సమస్యల పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామని చెపుతున్నారు. అది సరికాదు. సాక్షాత్ భారత ప్రధాన న్యాయమూర్తి వారిని అభ్యర్ధించినపుడు, వారి సమస్యలని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నప్పుడు కూడా వారు ఇంకా సమ్మె కొనసాగిస్తే వారు తమ సమస్యల పరిష్కారం కోసమే సమ్మె చేస్తున్నారా లేదా రాజకీయ నేతలు ప్రేరేపించుతున్నందునే సమ్మె చేస్తున్నారా? అనే అనుమానాలు కలగడం సహజం. కనుక వారు కూడా జస్టిస్ టి.ఎస్. టాకూర్ మాటకి గౌరవమిచ్చి తక్షణమే సమ్మె విరమించి విధులలో చేరినట్లయితే వారికీ గౌరవంగా ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తికి గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది. అప్పుడు వారి సమస్యలని పరిష్కరించవలసిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుంది కనుక తప్పకుండా ఆయన వాటి పరిష్కారం కోసం చొరవ తీసుకొంటారు. అలాకాదని ఇంకా సమ్మె కొనసాగిస్తే, వారి సమస్యల పరిష్కారం కావడం ఇంకా ఆలస్యం అవుతుంది. న్యాయస్థానాన్ని ధిక్కరించినందుకు కటినమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని న్యాయవాదులైన వారికి తెలియకపోదు.