వైసీపీ కోసం చాలా కాలంగా కష్టపడుతున్న లక్ష్మిపార్వతికి ప్రభుత్వం ఓ నామినేటెడ్ పోస్టు ఇచ్చింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్మన్ గా జగన్ నియమించారు. కేబినెట్ హోదా ఇచ్చారు. నెలకు రూ. నాలుగు లక్షల వరకూ జీత భత్యాలు నిర్దేశించారు. ఆ మేరకు అధికారిక ఆదేశాలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు.. ఓ వివాదం వచ్చి పడింది… అదేమిటంటే.. అసలు ఏపీలో తెలుగు అకాడమీ చైర్మన్ అనే పదవే లేదట. ఆమెకు ఇప్పటి వరకూ ఒక్క నెల కూడా జీతం అంతలేదు. దీనిపై…ఆమె ప్రభుత్వ పెద్దల్ని ఆరా తీస్తే.. తెలుగు అకాడమీ ఉన్నత విద్యాశాఖ కిందకు వస్తుందని.. ఆ శాఖ జీతాలు చెల్లిస్తుందని చెప్పారు. ఆమె.. ఉన్నత విద్యాశాఖ వద్దకు వెళ్తే… అసలు తమ దగ్గర తెలుగు ఆకాడమీ విభాగం లేదని.. జీతాలివ్వలేమని స్పష్టం చేశారు. దీంతో.. ఆమె నియామకం ఉత్తర్వులిచ్చిన సాధారణ పరిపాలన శాఖ.. లక్ష్మిపార్వతికి జీతభత్యాలు చెల్లించాలని నిర్ణయించుకుంది.
అసలు తెలుగు ఆకాడమీ చైర్మన్ పదవి లేకపోవడానికి కారణాలు ఉన్నాయి. హైదరాబాద్లో తెలుగు అకాడమీ ఉంది. అది విభజన చట్టంలో షెడ్యూల్ 10 కిందకు వస్తుంది. ఇంకా ఆ సంస్థను విభజించలేదు. దాంతో.. ఏపీ, తెలంగాణకు.. రెండు వేర్వేరు చైర్మన్లు లేరు. అసలు ఏపీలో ఇంత వరకూ ఉనికే లేదు. షెడ్యూల్ 10లోని ఆ సంస్థను విభజించి ఏపీకి అప్పగించిన తర్వాత మాత్రమే చైర్మన్ ను నియమించాల్సి ఉంటుంది. కానీ ఏపీ సర్కార్… పదవుల పంపకంలో.. దాన్ని కూడా చేర్చి.. లక్ష్మిపార్వతికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో సమస్య వచ్చి పడింది. తెలుగు అకాడమీనే లేనప్పుడు.. లక్ష్మిపార్వతి ఇంత కాలం పదవిలో ఉండి ఏం చేశారన్నది చాలా మందికి అర్థం కాని విషయం. ఆమె ఏమీ చేయకపోయినా.. నెలకు రూ. నాలుగు లక్షల వరకూ జీతభత్యాలు తీసుకోబోతున్నారనేది.. తాజా పరిణామాలతో తేలిన నిజం.
తెలుగు ఆకాడమీ లక్ష్యం.. తెలుగు మీడియంలో ఉన్నత విద్యను వ్యాప్తి చేయడం. పాఠ్యపుస్తకాలు రూపొందించడం. కానీ ఏపీ సర్కార్… వచ్చే విద్యా సంవత్సరం నుంచి… ఎనిమిదో తరగతి వరకూ.. మొత్తాన్ని ఇంగ్లిష్ మీడియం చేస్తోంది. ఈ క్రమంలో లక్ష్మిపార్వతిని తెలుగు అకాడమీ చైర్మన్ గా నియమించారు. అంటే.. మామూలుగానే ఆ పదవి ఉనికిలో లేదు.. ఆ తర్వాత పాఠ్యపుస్తకాల అవసరం కూడా ఉండదు. అలాంటి పదవిని లక్ష్మిపార్వతికి ఇచ్చిన వైసీపీ … ఆమెకు ఇప్పటి వరకూ జీతభత్యాలు కూడా అందించలేకపోయారు. ఇప్పుడు పదవి లేదనే వాదనను వినిపిస్తున్నారు.