టామ్ రేటింగులలో అవకతవకలు పెరిగిపోతున్నాయనే ఆరోపణల మధ్య బార్క్ రంగ ప్రవేశం చేసింది. ప్రధానమైన అడ్వర్టయిజింగ్ సంస్థలే ఏర్పాటు చేసుకున్నాయి గనక దానికి ప్రత్యేక విలువ కూడా ఏర్పడింది. అందుకు తగినట్టే వచ్చిన కొద్ది మాసాల తర్వాత రేటింగుల తీరుతెన్నులు సమూలంగా మారిపోయాయి. ఆ తర్వాత కొంతకాలం పరిశీలన చేయాలంటూ ఫ్రధానమైన ఛానళ్లకు రేటింగు ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఆ తర్వాత వాటి స్థానాన్ని దాదాపు పునరుద్ధరించారు. ఇదంతా వెంట వెంట జరిగిపోయిన పరిణామక్రమం. ఈ సందర్భంగా కొన్ని ఛానళ్లు వెనక్కు పోయాయి. నాలుగైదు మొదటి వరసలో స్థిరపడ్డాయి. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వచ్చి చేరడం తప్ప ఈ విషయంలో పెద్ద మార్పులేమీ లేవు. డిస్ట్రిబ్యూషన్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టిన తర్వాత ఎబిఎన్‌కు రేటింతు పెరగడంలోనూ ఆశ్చర్యం లేదు. ఇంకా ఇతరులకు ఫిర్యాదులుంటే వుండొచ్చు కూడా.
కాని అన్నిటికంటే పెద్ద సమస్య ఇప్పుడు బార్క్ మొత్తంగా తెలుగు ఛానళ్ల జిపిఆర్లు తగ్గించి వేసింది.వందల్లో వున్నవాటిని యాభై ముప్పైల దగ్గరకు తెచ్చింది. పైగా ముఖ్యమైన ఛానళ్ల మధ్య రేటింగులో తేడాలు కూడా తక్కువగానే వుంటున్నాయి.ఇదంతా మరో దుమారానికి దారితీసింది. జాతీయంగానూ బార్క్ నుంచి తప్పుకుంటున్నట్టు మూడు నాలుగు ఇంగ్లీషు చానళ్లు ప్రకటించాయి. ఆర్నాబ్ గోస్వామి పెట్టిన రిపబ్లిక్ ఛానల్ కనీసంగా ప్రచారం కాకముందే అత్యధిక రేటింగు ఎలా వచ్చిందనేది వాటి విమర్శ. నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ అది పాపులర్ కాలేదు గాని రేటింగులో అదుర్స్! అంటే ఏదో మాయాజాలం వుందని తేలిపోయింది. దీన్ని సరిచేయాలంటూ అనేక ఛానళ్లు నిష్క్రమించిన సంగతి బార్క్ కూడా ధృవీకరించింది. అయితే అదేదో సాంకేతిక సమస్య(వాటర్ మార్క్) అన్నట్టు చెబుతున్నది. అంతకంటే కూడా కీలకం ఏమంటే ఎవరున్నా లేకున్నా మేము బార్క్ ప్రకారమే యాడ్స్ ఇస్తామంటున్నారు. కనుక ఇది జటిల సమస్యే.