కథ, కవిత్వం, నవల, వ్యాసం, చరిత్ర, వ్యంగ్యం, పద్యం, వచనం…ఇలా తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ 59 ఏళ్ళపాటు వేల పుస్తకాలు ప్రచురించిన సంస్ధ ”నవోదయా పబ్లిషర్స్” మూత పడిపోయింది. రెండుతెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న 10 కోట్ల మంది తెలుగువారిలో అచ్చు పుస్తకాన్ని కొని చదివే పాఠకుల సంఖ్య వేగంగా పడిపోతూండటంతో షాపు అద్దె కూడా గిట్టుబాటు కాని పరిస్ధితుల్లో విజయవాడ కేంద్రంగా వున్న ఈ సంస్ధను మే1 వ తేదీన మూసివేశారు.
స్వాతంత్రోద్యమంతోపాటుగానే ప్రజల సమగ్ర వికాసానికి వెల్లువెత్తిన అనేక ఉద్యమాల్లో గ్రంధాలయోద్యమం ఒకటి. ఈ చైతన్యం వల్ల 1930 -70 మధ్య ఓపాతిక పుస్తకాలైనా లేని మధ్యతరగతి తెలుగు ఇల్లు ఒక్కటికూడా వుండేదికాదని పెద్దవాళ్ళు చెబుతూంటారు.
వారపత్రికల్లో సీరియళ్ళు నవలలుగా అచ్చుకొచ్చిన కాలంలో పుట్టిన ఓపాతిక ప్రచురణ సంస్ధల్లో నవోదయ సుదీర్ఘకాలం నడిచింది. ప్రజల్లో హేతుబద్ధమైన, శాస్త్రీయమైన దృక్ఫధాన్ని పెంపొందించే అభిరుచితో ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ట్రస్ట్, విశాలాంధ్ర, ప్రజాశక్తి మొదలైన ప్రచురణ సంస్ధలు అమ్మకాలు, విరాళాలతో మనుగడ సాగిస్తూండగా, తెలుగు సాహిత్యాన్ని ప్రచురించే సంస్ధల్లో అగ్రగామి అయిన నవోదయ 59 ఏళ్ళు కొనసాగి ”పోషణ లేని అభిరుచి జీవించజాలదని” ముగింపు ప్రకటన చేసేసింది.
నవోదయా రామమోహనరావుగానే పుస్తక ప్రియులకు తెలిసిన అట్లూరి రామమోహనరావు ఒక సందర్భంలో “పాఠకులంతా ప్రేక్షకులుగా మారిపోయారు” అని పుస్తక ప్రపంచం భవిష్యత్తు గురించి నిట్టూర్చారు. పదికోట్ల మంది తెలుగు వారు వుండగా ఐదారు వందల కాపీలు అమ్మిన పుస్తకమే బెస్ట్ సెల్లర్ కిరీటాన్ని ధరిస్తోందంటే చదువరుల సంఖ్య ఎంత దారుణంగా పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.
సాహిత్య, సామాజిక అంశాలమీద ప్రతిష్టాత్మకమైన పుస్తకాలను ప్రచురించిన పెద్ద సంస్ధలన్నీ కెరియర్ గైడెన్స్ పుస్తకాల ప్రచురణకో, ఆధ్యాత్మిక అంశాల పుస్తకాల ప్రచురణకో పరిమితమై పోయాయి. అలా రూపాంతరం చెందలేని నవోదయ భీష్మాచార్యుడు స్వచ్ఛంద మరణం పొంది నట్టు తనను తాను అతి భారంగా ఉపసంహరించుకుంది.
తాళపత్రగ్రంధం, రాగిరేకుల మీదికి రూపాంతరం చెందింది. కాగితాన్ని కనుగొన్నాక, అచ్చుయంత్రాన్ని రూపొందించాక ముస్తాబైన ప్రింటు పుస్తకం సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ టెక్నాలజీ, డాటా ట్రాన్స్ ఫర్మేషన్లవల్ల అచు పుస్తకం e పుస్తక రూపమెత్తింది. తెలుగు ప్రచురణ కర్తలు కాలానుగుణంగా పుస్తకాన్ని డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ పుస్తకంగా రూపొందించి వుంటే తెలుగు పుస్తకం మరి కొంత కాలం తప్పక వుండేదే!
ఈ-బుక్ ప్రచురణలో కూడా సమస్యలు పెద్దగానే వున్నాయి. కాపీరైట్ కొనుగోళ్ళ సమస్యలు, డిజిటల్ మేనేజిమెంట్ హక్కుల లైసెన్సు ఫీజు భారాలు, భారీ సైజుల్లో సర్వర్ల నిర్వహణ ఆర్ధిక భారాలతో ముడిపడి వున్నవే! అయితే కాగితం బరువు, పుస్తకాల రవాణాభారం, దాచి వుంచడానికి, షోకేసుల్లో వుంచడానికి విశాలమైన భవనాలు అవసరం లేకపోవడమే డిజిటల్ పుస్తకాల్లో సౌలభ్యం. ఇ పేమెంటు, డౌన్ లోడ్ లతో పుస్తకం కంపూటర్ లోకో, యాప్ లోకో, గాడ్జెట్ లోకో దిగుమతి అయిపోతుంది. జేబులో పెట్టుకుపోగల 130 గ్రాముల కోబో రీడర్ లో కనీసం 800 తెలుగు పిడిఎఫ్ పుస్తకాలు పట్టేస్తాయి. తెలుగులో కినిగే డాట్ కామ్ అనే సంస్ధ వందల సంఖ్యలో ఈ-పుస్తకాలను ప్రచురిస్తోంది.
పుస్తకం ఏరూపంలోకి వచ్చినా కొని చదివే పాఠకులు అంతరించిపోతూండటమే తెలుగు పుస్తకానికి (కూడా) పట్టుకున్న అవసానదశ. విజయవాడలో ఏలూరు రోడ్డులో 59 ఏళ్ళు సాహితీ బాండాగారమై వెలుగొంది, పుస్తక ప్రపంచం నుంచి నిష్క్రమించిన నవోదయా పబ్లిషర్స్ ఈ విషాద ప్రస్ధానంలో అతి పెద్ద మైలు రాయి.