విశాల్ ఈ వారం ‘రాయుడు’గా రౌద్రం చూపిస్తున్నాడు. శుక్రవారం ఈచిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ సినిమాకాబట్టి.. బీసీల్లో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అయితే ఈ సినిమా నిలబడడం కష్టమని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. కారణం… రాయుడులో మాస్ డోసు బాగా ఓవర్ అయిపోవడమే. రాయుడు పోస్టర్ చూస్తే మాస్ సినిమా అని అర్థమైపోతోంది. అయితే.. మరీ ఊర మాస్ గా ఈ సినిమా తీర్చిదిద్దడం, తమిళ నేటివిటీలో ముంచి తీసినట్టు ఉండడం రాయుడికి భారీ మైనస్‌లు. తన ప్రతీ సినిమానీ తెలుగులో డబ్ చేస్తున్న విశాల్.. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని పట్టించుకోకపోవడం దారుణం. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లు చూస్తే.. విశాల్ తెలుగు ప్రేక్షకుల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని తెలిసిపోతూనే ఉంది. శ్రీదివ్య ని మినహాయిస్తే.. తెలుగు నటీ, నటుడు ఒక్కరూ లేరు.
‘నేను తెలుగువాడ్నే..’ అని చెప్పుకొనే విశాల్,. తన సినిమాని తెలుగులో డబ్ చేసి.. డబ్బులు వెనకేసుకొందామనుకొంటున్న విశాల్.. తన సినిమాలో కనీసం ఇద్దరు ముగ్గురు తెలుగు నటులనైనా
తీసుకొంటే బాగుంటుంది. ఎందుకంటే.. అన్నీ తమిళ మొహాలే అవ్వడంతో ఏ పాత్రతోనూ తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం లేదు. రాయుడు అనే కాదు.. విశాల్ తమిళ సినిమాలన్నీ ఇలానే తయారవుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలని విశాల్‌కి ఉంటే.. తెలుగు నేటివిటీ కాస్తయినా ఉండే కథల్ని ఎంచుకొంటే మంచిది. ఇలాంటి `రా` కథలొస్తే మాత్రం విశాల్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు పూర్తిగా పక్కన పెట్టేయడం ఖాయం.