కేంద్ర ప్రభుత్వం ప్రతీ విషయంలోనూ.. తమ పెత్తనం ఉండేలా చూసుకోవడానికి చేయాల్సినదంతా చేస్తోంది. చివరికి దేశంలోని అన్ని రకాల సినీ పరిశ్రమలను గుప్పిట్లో పెట్టుకోవడానికి ఓ చట్టం తీసుకు వస్తోంది.దీని ప్రకారం.. సినిమా ప్రదర్శలకు అనుమతి ఇవ్వాలావద్దా అన్న అధికారం పూర్తి స్థాయిలోకేంద్రానికి దఖలు పడేలా ఓ బిల్లు తయారు చేసింది. దానిపై అభిప్రాయాలు కూడా సేకరించింది. సహజంగానే ఆ బిల్లుపై దేశవ్యాప్తంగా సినీరంగ వ్యతిరేకత చూపించింది. బాలీవుడ్లో కేంద్రానికి భయపడని కొంత మంది తమ వ్యతిరేకత బహిరంగంగానే తెలిపారు. తమిళ చిత్ర సీమ నుంచి కమల్ హాసన్‌తో పాటు సూర్య కూడా గొంతెత్తారు. ఇతర పరిశ్రమల నుంచి కూడా.. ఈ చట్టం సినీ పరిశ్రమ స్వేచ్చను హరించేదేనని.. అమలు చేయవద్దని కోరుతూ.. డిమాండ్లు వినిపించాయి. అయితే.. టాలీవుడ్ నుంచి మాత్రం.. ఒక్క వాయిస్ కూడా రెయిజ్ కాలేదు.
ప్రస్తుతం ఒకసారి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేశాక ఆ తర్వాత కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. గతంలో ఇలా జోక్యం చేసుకున్న సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆ నిర్ణయాలను తప్పు పట్టింది. కేంద్రం జోక్యం చేసుకోవాలంటే.. దానికి తగ్గట్లుగా చట్టాలు ఉండాలని స్పష్టం చేసింది. దీంతో కేంద్రానికి చట్టం చేయాలనే ఆలోచన వచ్చింది. ఎన్నో సినిమాలు దేశ వ్యతిరేక భావాలతో ఉంటున్నాయని.. విదేశాల్లో పరువు తీస్తున్నాయని.. రకరకాల కారణాలు చెప్పి సినిమాలపై కేంద్రం పెత్తనం చెలాయించాలని అనుకుంటోంది. ప్రస్తుతం బీజేపీ భావజాలం..కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేసినిమాలపై దేశవ్యతిరేక ముద్ర వేస్తున్నారు. ఈ చట్టం వస్తే.. సినిమాలపై పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఉంటుందని క్రియేటర్లు ఆందోళన చెందుతున్నారు.
కేంద్రం అనుకున్నట్లుగా చట్టం తీసుకు వస్తే సృజనాత్మకత పూర్తిగా ఓ వైపు ఉంచాల్సిందే. ఏ మాత్రం… బీజేపీ వ్యతిరేకత.. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక అంశాలపై సినిమాలు తీసినా వాటిని బయటకు రాకుండా చేయడానికి పూర్తి అధికారం కేంద్రానికి ఉంటుంది. ఎంత గగ్గోలు పెట్టినా ప్రయోజనం ఉండదు. అందుకే.. భావ ప్రకటనా స్వేచ్చను కేంద్రం ఈ చట్టం ద్వారా నియంత్రిస్తోందని.. తమిళ.. హిందీ రంగానికి చెందిన కొంత మంది ప్రముఖులు అంటున్నారు. అయితే.. ఇలాంటి భావన టాలీవుడ్ వారికి లేదు. అసలు ఈ చట్టంపై ఎలాంటి అభిప్రాయాలనూ వ్యక్తం చేయలేదు.