హైదరాబాద్: చిరకాల, బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీ అధినేత్రిని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఎందుకు కలుస్తాడనుకుంటున్నారా! కానీ కలిశాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య నిన్న ఢిల్లీలో సోనియాగాంధిని ఆమె నివాసంలో కలిశారు. అయితే ఇదేమీ పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన వ్యవహారం కాదులెండి. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా చూడమని అడగటానికి ఇతర బీసీ సంఘం నేతలతో కలిసి సోనియాను కలిశారు. అయితే ఈ నేతలలో కృష్ణయ్య తప్పితే మిగిలినవారందరూ కాంగ్రెస్‌వారు కావటం విశేషం. విద్య, ఉద్యోగరంగాలతోబాటు రాజకీయరంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించటానికి వీలుకల్పించే బీసీ బిల్లుపై పోరాటం చేస్తానని సోనియా తమకు హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. బీసీల డిమాండ్లగురించి ఆమె తమతో అరగంటపైగా చర్చించారని, అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారని కృష్ణయ్య వెల్లడించారు. తర్వాత ఈ బీసీనేతలందరూ సోనియాతో గ్రూప్ ఫోటో దిగారు.
తెలుగుదేశంపార్టీ కృష్ణయ్యను 2014 ఎన్నికలముందు తమ పార్టీలో చేర్చుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనను ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో నిలబెట్టింది. వాస్తవానికి తెలుగుదేశంపార్టీ ఇదంతా ఆయనేదో గెలుస్తాడనికాక నామ్కేవాస్తేగా చేసింది. ఎల్.బి.నగర్లో తాను గెలుస్తానని కృష్ణయ్యకూడా ఊహించలేదు. కానీ, ఆ నియోజకవర్గంలోని సీమాంధ్రవాసుల ప్రాబల్యంవల్ల అనూహ్యరీతిలో సుధీర్ రెడ్డిని మట్టి కరిపించి కృష్ణయ్య ఎమ్మెల్యే అయ్యారు. కానీ అసెంబ్లీలో శాసనసభాపక్షనేత పదవి ఇవ్వనందువల్లో ఏమోగానీ, పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. తాజా పరిణామాన్నిబట్టిచూస్తే అసలు ఆయన తనను తాను టీడీపీ ఎమ్మెల్యేలాగా భావించటంలేదని అనిపిస్తోంది. ఏది ఏమైనా కృష్ణయ్య తెలుగుదేశం పుణ్యమా అని, సీమాంధ్రుల పుణ్యమా అని ఎమ్మెల్యే అయ్యాడుగానీ లేకపోతే ఆయనకు అసెంబ్లీ ఎన్నికలలో నిలబడి గెలిచే సత్తా లేదనేదిమాత్రం వాస్తవం. అలాంటి తెలుగుదేశానికి కృతజ్ఞతాభావంతో ఉండకుండా ఆ పార్టీకి ప్రత్యర్థి పార్టీ అధినేత్రిని కలిసి ఫోటోలు దిగటంమాత్రం సమంజసంగా అనిపించటంలేదు.