ప్రతి దర్శకుడికీ ఓ శైలి ఉంటుంది.. ఉండాలి కూడా! అయితే అదే పట్టుకొని వేళాడకూడదు. నేనిప్పుడూ ఇలాంటి సినిమాలే తీస్తా.. ఇలానే తీస్తా అని కూర్చుంటే అవుడ్డేటెడ్ అయిపోతారు మణిరత్నంలా! మణిరత్నం గొప్పోడే. ఆ మాటకొస్తే.. గొప్పాతి గొప్పోడు. ప్రతీ హీరో ఆయన ఫ్యానే. ఆయన సినిమాల్లో నటించాలని కలలుకన్న కథానాయికల లేదంటే అది శుద్ద అబద్దం. మణి సినిమా టేకింగు, పాటలూ.. అబ్బబ్బో లొట్టలేసుకొని చూశారు. ఎంతకాలం?? మణి కొత్త కొత్త జోనర్లలో సినిమాలు తీసినంత కాలం. ఇప్పుడూ అదే టేకింగు, అదే కథ, అదే కెమెరా యాంగిల్ అంటే.. చూడగలమా? వంశీ పరిస్థితేంటి? ఆయన ఏమైనా తక్కువ తిన్నోడా. తెలుగుదనం, తెలుగు భాష, తెలుగు అందం అంటే పడిచచ్చిపోయేవాళ్లంతా వాళ్లని ఆయన సినిమా వస్తోందంటే టంచనుగా థియేటర్ల దగ్గర వాలిపోయేవారు. వంశీ ప్రతీ సినిమా మ్యూజికల్ హిట్టే. ఆయన సినిమా ఎలాగున్నా – పాటల క్యాసెట్లు అరిగిపోయే వరకూ వినేవాళ్లు. అరిగిపోతే కొత్తవి కొనుక్కొని మళ్లీ వినేవారు. అదీ వంశీ అంటే. మరి ఇప్పుడో.. ఎప్పుడో పాతికేళ్ల క్రితం తీసిన ఫార్మెట్లో ఫ్యాషన్ డిజైనర్ తీస్తే.. రెండో షోకే తిప్పి పంపించారు.
ట్రెండ్ పట్టుకోవాలి. ట్రెండ్ సృష్టించాలి. అది కుదర్దంటే… ఫాలో అవ్వాలి. నోకియా బండ ఫోన్లు వచ్చినప్పుడు బాగానే ఉండేవి. ఇప్పుడూ అవే వాడడం లేదు కదా?? స్మార్ట్ ఫోన్లలోకి జనం మారిపోయారు. ఆ టేస్టుల్ని గమనించకపోతే ఎలా?? ఇప్పుడు ఈ తరం దగ్గరకు వద్దాం. ముందుకు చెప్పుకోవాల్సింది మన పూరి గురించే. పూరి నుంచి అద్భుతాలెన్నో వచ్చాయి. ఓ విధంగా ట్రెండ్ సృష్టించిన దర్శకుడు. హీరోయిజం ఎలా ఉండాలో, ఎలా ఉంటే బాగుంటుందో టేస్ట్ చూపించాడు. అది జనానికి పట్టేసింది. డైలాగులు మత్తెక్కించాయి. తన వేగం చూసి.. తల్లడిల్లిపోయారంతా. ఇప్పుడు అదంతా ఏమైపోయింది. పోకిరి తరవాత పూరి పొగరు ఎటు పోయింది. వరుస హిట్లు కొట్టి రిలాక్స్ అయిపోయిన పూరి.. తీసిన సినిమానే తీస్తూ కూర్చున్నాడు. పూరి సినిమాలన్నీ ముందరేసుకొని కూర్చుంటే.. ఒకే టికెట్టుపై ఎన్ని పాత సినిమాలు చూపించాడో అర్థమైపోతుంది. నందమూరి బాలకృష్ణ లాంటి హీరో అవకాశం ఇచ్చినా.. అదే పాత రొడ్డు కొట్టుడు కథతో వచ్చాడంటే.. పూరిని ఏమనుకోవాలి.. ఎలా చూడాలి..??
కృష్ణవంశీ కూడా ఓకే ఛట్రంలో ఇరుక్కుపోయాడు. అక్కడ్నుంచి బయటపడే మార్గం వెదుక్కోవడం లేదు. కృష్ణవంశీ మేధావే. తెలుగు సినిమా ఇలా ఉంటే బాగుంటుంది కదా?? అని ఆలోచించేవాడు. కానీ అతని ఆలోచనలన్నీ ఒక చోటే స్ట్రక్ అయిపోవడం దురదృష్టం. నక్షత్రం చూస్తే… కృష్ణవంశీ వెనక్కి పరుగెడుతున్నాడేమో అనే అనుమానం వేస్తుంటుంది. ఆ ఫ్రేములు, సీన్ కట్ చేసే పద్ధతి, డైలాగులు.. ఇవన్నీ సింధూరం నాటి వంశీని గుర్తు తెస్తాయి. నాయనా వంశీ.. సింధూరం వచ్చి ఇరవై ఏళ్లయిపోయింది.. అక్కడ్నుంచి నువ్వు బయటకు రావాలి అంటూ..
వంశీ ఫ్యాన్స్ అరచి గీ పెడుతున్నా.. ఆయనకు అర్థం కావడం లేదాయె! శ్రీనువైట్ల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతున్న వైనం చూస్తూనే ఉన్నాం. ఢీ ఫార్ములాని ఆయన అరగదీసేశాడు. విసుగొచ్చేలా చేశాడు. విలన్ని బకరా చేసే కాన్సెప్ట్‌తో సినిమా అంటే ప్రేక్షకుడు భయపడి థియేటర్ల నుంచి పారిపోయేలా చేశాడు. తీరా చూస్తే ఏమైంది??? అన్ని హిట్లు చూసిన దర్శకుడే.. ఇప్పుడు నిర్మాత కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చేసింది.
కొంచెంలో కొంచెం తేజ బెటర్ అయ్యాడు. వరుస ఫ్లాపులతో.. తన తప్పుల్ని తెలుసుకొన్నాడు. నేనే రాజు నేనే మంత్రితో తేజ తన జోనర్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. తేజలా దర్శకులంతా కాస్త ఆలోచించాలి. తమ మేధావితనం ఎటు వెళ్తుందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పుకొన్న దర్శకులంతా… తమ జీవితాల్లో స్థిరపడినవాళ్లే. వాళ్లకు సినిమాల్లేకపోయినా ఫర్వాలేదు. కాకపోతే వాళ్లని నమ్ముకొని డబ్బులు పెట్టుబడి పెడుతున్న నిర్మాతల్ని, టికెట్ కొంటున్న ప్రేక్షకుల ఆశల్ని వమ్ము చేసే హక్కు వాళ్లకు లేదు.
తెలుగు సినిమా ఎంతో మంది దర్శకుల్ని చూసింది.. చూస్తోంది. ఎప్పుడూ ఒకే ఫార్ములాని పట్టుకొని వేలాడుతున్నవాళ్లెంత గొప్పవాళ్లైనా నిర్దాక్ష్యణ్యంగా తిప్పి కొట్టింది. బి.గోపాల్, కృష్ణారెడ్డి లాంటివాళ్లు ఔట్ డేటెడ్ అయిపోయి ఇప్పుడు ఖాళీగా కూర్చున్నారంటే… తెలుగు సినిమా ప్రేక్షకుల జడ్జ్మెంట్ ఎంత స్ట్రాంగో అర్థం చేసుకోవాలి. ఓ వైపు పెళ్లి చూపులు, ఫిదా, అర్జున్ రెడ్డి లాంటి కథలు వస్తున్నప్పుడు ముతక మాస్ సినిమాల్ని భరించాల్సిన అవసరం తెలుగు సినిమాకీ, తెలుగు ప్రేక్షకులకూ లేదు. ఈ విషయాన్ని అగ్ర దర్శకులు గుర్తు పెట్టుకోవడం మంచిదేమో.