సినిమా అనేది పక్కా బిజినెస్. నీవల్ల నాకేంటి, నా వల్ల నీకేంటి?? బస్… వ్యాపారం మొదలైపోతుంది. ”వీడు నాకు పైసాకి కూడా పనికి రాడు” అంటే.. వాడి జోలికి కూడా వెళ్లలెవరూ..? అహనా పెళ్లంటలో ”నాకేంటి?? అహ… నాకేంటట?” అని చేయి చేచేవాళ్లే ఎక్కువ. బంధాలు, ఆత్మీయతలు అనేవి ఇక్కడ ప్లాస్టిక్ పువ్వులు. ప్రెస్ మీట్లలో ఇంటర్వ్యూలలో… నేనూ, డైరెక్టరూ భలే బాగా క్లోజ్ అయిపోయాం అనేవాళ్లే సెట్లో తిట్టుకొంటారు.. ఆ మాట కొస్తే కొట్టుకొంటారు కూడా. మా సినిమా అంతా పిక్నిక్లా జరిగిందని మైకు పట్టుకొని మీడియా ముందు చెప్పుకొనే నిర్మాత వెనక్కి వెళ్లి దర్శకుడు చేసిన నిర్వాకానికి వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. ఇదంతా తెలియంది ఎవ్వరికి??
అయితే ఈమధ్య కొత్త ట్రెడీషన్ ఒకటి పుట్టుకొచ్చింది. దర్శకుడు హిట్టుకొడితే… హీరో గారు, ప్రొడ్యూసరు గారూ గిఫ్టుల మీద గిఫ్టులిచ్చేస్తుంటారు. కొరటాల శివకు శ్రీమంతుడు తరవాత ఇలాంటి బహుమానాలు తగిలాయి. భలే భలే మగాడివోయ్ తీసిన మారుతికి కూడా అంతే. పూరికి అప్పట్లో నిర్మాత బండ్ల గణేష్ భారీ గిఫ్టులిచ్చి ఆకట్టుకొన్నాడు. ఇప్పుడు అభినేత్రి లాంటి సూపర్ డూపర్ బంపర్ హిట్ (వాళ్లు అనేసుకొంటున్నారు లెండి) తీసినందుకు విజయ్‌కి ప్రభుదేవా ఓ ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.
ఓ దర్శకుడికి ఈ మాత్రం గౌరవం దక్కడం నిజంగా ఆనందించదగిన విషయం. పారితోషికాలు ఎగ్గొట్టే నిర్మాతలు సినిమా విడుదలయ్యాక కూడా దర్శకుడ్ని గుర్తు పెట్టుకొని ఖరీదైన కార్లు బహుమతిగా ఇవ్వడం తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. అయితే ఈ కార్ల వెనుక పబ్లిసిటీ అనే అంతర్లీనమైన విషయం కూడా దాగుంటుందన్న విషయాన్ని అందరూ గుర్తించుకోవాల్సిందే. సినిమా విడుదలయ్యాక ఆ నిర్మాత… దర్శకుడికి ఎగస్ట్రా బెనిఫిట్ ఇవ్వడమన్నది గొప్ప సంప్రదాయమే. అయితే…. దాని వెనుక కూడా పబ్లిసిటీ స్టంట్ ఉంటుంది. దర్శకుడ్ని మచ్చిక చేసుకొని, తదుపరి సినిమాకి లైన్లో పెట్టుకోవడం అనేది నిర్మాత ఎత్తుగడ. ఇక్కడ దర్శకుడి బెనిఫిట్ ఏమిటంటే.. ”ఫలానా సినిమాకి బాగా లాభాలొచ్చుంటాయి.. అందుకే ఇలాంటి బహుమానాలు అందుతున్నాయి.. నిజంగానే ఆ దర్శకుడు పెద్ద తోపుగాడు..” అనే స్థాయిలో సినీ జనాలు ఊహించుకోవాలి.
దాంతో.. ఆ దర్శకుడి తదుపరి సినిమాకి మార్కెట్, బడ్జెట్, రెమ్యునరేషన్ .. ఇలాంటివన్నీ అమాంతం పెరిగిపోతాయన్న ఫాల్స్ ప్రెస్టేజ్! సాధారణంగా ప్రతీ నిర్మాత… తన టెక్నీషియన్లకు ఎంతో కొంత మొత్తం బాకీ పడిపోతుంటాడు. ‘సినిమా విడుదలయ్యాక చూసుకొందాంలే…’ అని ముందే మాట్లాడుకొంటారు. నిర్మాత సేఫ్ అయినా… బాకీ మాత్రం దర్శకుడికి అందదు. దాన్ని ఇలా కార్ల రూపంలో, ఇతర బహుమానాల రూపంలో ఇచ్చిపుచ్చుకొని… దాన్ని కూడా సినిమా పబ్లిసిటీలో భాగంగా వాడుకొంటారు. ఇంకో బాపతు నిర్మాతలు ఉంటారు. ‘ఈ సినిమాకి నీ పారితోషికం తగ్గించుకో.. సినిమా బాగా ఆడితే.. ఆఖర్లో ఏదో ఒకటి ఇస్తానులే’ అంటూ ముందస్తు ఒప్పందాలు చేసుకొంటారు. దాన్ని ఇలా తీర్చుకొంటారు. అదీ.. ఇలాంటి ఖరీదైన బహుమానాల వెనుక ఉన్న మతలబు. మనమేమో.. ఆ దర్శకుడంటే నిర్మాతకు ఎంతిష్టమో అని చెప్పుకొంటుంటాం. అంతే… అంతే..