నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకొంది. ఈ సంక్రాంతికి తెలుగులో డబ్బింగ్ సినిమాలకు అనుమతి లేదని అల్టిమేట్టం జారీ చేసింది. ఇది నిర్మాత దిల్ రాజుకి మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే… తన `వారసుడు` సినిమాని ఈ సంక్రాంతికి విడుదల చేద్దామనుకొంటున్నారు. వంశీ పైడిపల్లి ఈ సినిమా దర్శకుడు . ఇది ద్విభాషా చిత్రమని చెబుతున్నా – తమిళంలో తీసి తెలుగులో డబ్ చేశారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయంతో.. వారసుడు సంక్రాంతి విడుదలకు బ్రేక్ పడినట్టైంది.
2019లో సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలు నిలిచినప్పుడు, దిల్ రాజు ‘స్ట్రయిట్ సినిమాలు ఉండగా, డబ్బింగ్ సినిమాలు ఆడనిచ్చేది లేదు’ అంటూ.. గట్టిగా అడ్డుకొన్నారు. ఇప్పుడు ఆ ఉదంతాన్నే ఫిల్మ్ ఛాంబర్ ప్రస్తావిస్తోంది. ఆ నిబంధనని ఈసారీ అమలు చేస్తామని చెబుతోంది. దాంతో `వారసుడు` సంక్రాంతి విడుదల డైలామాలో పడినట్టైంది. ఈ సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య`, `వీర సింహారెడ్డి`తో పాటుగా వారసుడు రావాల్సివుంది. అయితే ఇప్పుడు.. వారసుడు వెనకడుగు వేయక తప్పదు. `ఇది డబ్బింగ్ సినిమా కాదు.. స్ట్రయిట్ సినిమానే` అనే విషయాన్ని దిల్ రాజు నిరూపించుకోవాల్సివుంటుంది. కానీ. అది సాధ్యం కాదు. ఇది తమిళ సినిమానే అనేది సినీ జనాలు మొత్తానికి తెలుసు. విజయ్ కూడా `ముందు తమిళంలో తీసి.. ఆ తరవాత తెలుగులో డబ్ చేస్తున్నాం` అని ఓ సందర్భంలో క్లారిటీగా చెప్పాడు. సో.. వారసుడు సంక్రాంతికి రావడం దాదాపు అసాధ్యమే.