‘పొట్టేల్’ ప్రెస్ మీట్ లో జరిగిన కాంట్రవర్సీ గుర్తుండే ఉంటుంది. కథానాయిక అనన్యపై ఓ మహిళా జర్నలిస్టు సంధించిన కాస్టింగ్ కౌచ్ ప్రశ్నలు దిమ్మతిరిగేలా చేశాయి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, కమిట్ మెంట్ కు ఒప్పుకొంటే ఓ రేటు, లేకుంటే మరో రేటంటూ ఆ జర్నలిస్టు బల్లగుద్ది మరీ చెప్పింది. అసలు ప్రెస్ మీట్ ఏమిటి? జర్నలిస్టు అడిగిన విషయం ఏమిటి? రెండింటికీ ఏమైనా సంబంధం ఉందా? అంటూ అంతా ముక్కున వేలేసుకొన్నారు. ప్రశ్నలు అడగడంలో ఓ పద్ధతి ఉంటుంది. సున్నితమైన విషయాల్ని మరింత సున్నితంగా డీల్ చేయాలి. కానీ.. అది మర్చిపోయి, కాంట్రవర్సీ కోసం ప్రశ్నలు అడిగి, దాంతో పాపులర్ అయిపోదామన్న ఉద్దేశ్యాలు జర్నలిజంలో కనిపించడం శోచనీయం. దీనిపై ఇండస్ట్రీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి జర్నలిస్టులపై చర్యలు తీసుకోరా? అంటూ జర్నలిస్టు సంఘాలపై ఒత్తిడి పెరుగుతోంది.
తాజాగా ఫిల్మ్ ఛాంబర్ జర్నలిస్టు సంఘానికి ఓ లేఖ రాసింది. అనన్యపై జర్నలిస్టు అడిగిన ప్రశ్న అసంబద్ధంగా ఉందని, ఇలాంటి జర్నలిస్టులపై చర్యలు తీసుకోరా? అంటూ యూనియన్ ని సూటిగా ప్రశ్నించింది ఛాంబర్. సదరు జర్నలిస్టు కాస్ట్ కౌచింగ్ జరుగుతోందని, కమిట్ మెంట్ విషయాలు ఎగ్రిమెంట్ లోనే ఉన్నాయంటూ ఎలా చెప్పగలిగిందని, వాటిని ఆధారాలతో సహా ఛాంబర్‌కు సమర్పించాలని, వాటిపై రహస్యంగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చింది. ఆధారాలు లేని యెడల ఆ జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాల్సిందిగా యూనియన్ ని కోరింది. దీనిపై తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ విచారణ జరిపి, తగిన యాక్షన్ తీసుకోవడానికి సమాయాత్తం అవుతోంది. ఈ ఆదివారమే అసోసియేషన్ ఓ సమావేశం నిర్వహించాలని భావించింది. అయితే అది కుదర్లేదు. రెండు మూడు రోజుల్లో ఈ అంశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.