ఈ మధ్య పవన్ కల్యాణ్ అంశమై చెలరేగిన వివాదం మీడియా వెర్సెస్ సినీ పరిశ్రమ అనే స్థాయికి ఒక దశలో చేర్చే ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. పవన్ వివాదం నేపథ్యంలో కొన్ని ఛానెల్స్ పై మెగా ఫ్యామిలీ గుర్రుగా ఉంది. టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహాటీవీలపై నిషేధం ప్రకటించాలని పట్టుబడుతోంది. దీనికి తగ్గట్టుగానే త్వరలోనే నిషేధం విధింపు ఉంటుందనే తెలుస్తోంది. మే 2 నుంచి ఆ ఛానెల్స్ ను బ్యాన్ చేయాలంటూ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ్, జెమినీ కిరణ్ లు ఈ నిషేధ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని పరోక్షంగా నిర్మాత అల్లు అరవింద్ ప్రస్థావించడం గమనార్హం. నిన్న జరిగిన ‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇదే అంశమై అల్లు అరవింద్ కొన్ని సంకేతాలు ఇచ్చారు. సో… ఆ ఛానెల్స్ పై నిషేధం ప్రకటన లాంఛనం మాత్రమే అని అంటున్నారు. అయితే, ఈ విషయం బయటకి పొక్కడంతో సదరు టీవీ ఛానెల్స్ కూడా భారీ కసరత్తే మొదలుపెట్టినట్టు తెలుస్తోంది! ఒకవేళ ఇప్పుడు వినిపిస్తున్నట్టుగా మే 2 నుంచి నిషేధం ఉంటుందనే నిర్ణయం అధికారికంగా వెలువడితే… ఆ వెంటనే సదరు ఛానెల్స్ తెలుగు సినీ పరిశ్రమలో చీకటి కోణాలను వెతికి బట్టబయలు చేయాలనే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది సినీ రంగ పెద్దలకు సంబంధించి చీకటి కోణాలను వెలికి తీసే పనిలో కొన్ని ఛానెల్స్ ఉన్నట్టు సమాచారం. మే 2 తరువాత వీటిని ప్రసారం చేసేందుకు వారు కూడా సిద్ధపడుతున్నారట.
ఒకరిపై మరొకరు పోరాటం మొదలుపెడితే… జరిగేది ఇదే! నిజానికి, సినిమాలు – మీడియా ఒకరిపై ఒకరు ఆధాపడాల్సిన అవసరాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, సమస్యలు ఏవైనా ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం రెండు పక్కల నుంచీ జరగాలి. అంతేగానీ, ఒకరినొకరు నిందించుకుంటూ నిషేధించుకుంటూ పోతే రేప్పొద్దున్న ఇరు వర్గాలు అభాసుపాలు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజుకుంటున్న ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడితే అందరికీ బాగుంటుంది. మరి, ఆ ప్రయత్నం సినీ రంగం నుంచి ఎవరైనా చేస్తారేమో చూడాలి. కానీ, ఎవరికివారు పంతాలూ పట్టింపులకు పోతున్నారు. ఈ వివాదం ఎట్నుంచి ఎటు మళ్లుతుందో అన్నట్టుగా ఉంది.