తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాడులోనే వుండిపోయిందని, ఎపికి రావడం లేదని మంత్రులతో సహా మాట్లాడుతున్నారు. హైదరాబాదులో వుండటం రాష్ట్ర ద్రోహమైనట్టు చిత్రిస్తున్నారు. కాని లోకేశ్ భార్యా పిల్లలు తల్లి గారు కూడా హైదరాబాదులోనే వుంటున్న సంగతి అందరికీ తెలుసు.వారికి పెద్ద సౌధం వున్నది కూడా హైదరాబాదులో తప్ప విజయవాడలో కాదు. ఇక పోతే గత చరిత్రను చూసినా వివిధ వ్యవస్థల తరలింపు అంత సులభంగా త్వరితంగా జరగలేదు. 1952లో ఆంధ్ర రాస్ట్రం, 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినా మరో నలభై ఏళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసులోనే వుండిపోయింది. 1990లలో గాని ఈ క్రమం వేగం పుంజుకోలేదు. దానికి ముందు అక్కినేని అన్నపూర్ణస్టూడియో, ఎన్టీఆర్ రామకృష్ణ స్టుడియో నిర్మించినా అది కూడా ఇరవయ్యేళ్ల తర్వాత 1974,75లో జరిగింది. సారథీ స్డుడియోస్ కొనసాగుతున్నా క్రమంగా దెబ్బతినిపోయింది. ఆ కట్టిన అన్నపూర్ణ పద్మాలయా స్టుడియోలు ఎన్టీఆర్ ప్రభుత్వానికి వాటి యజమానులైన కృష్ణ అక్కినేని వంటి వారికి మధ్య స్పర్థకు దారితీశాయి. అప్పట్లో మరో భాష మాట్లాడే మద్రాసు(చెన్నై)లో అంత కాలం సినిమా పరిశ్రమ కొనసాగితే తప్పు కాదు గాని ఇప్పుడు మరో తెలుగు రాష్ట్ర కేంద్రమైన ఉమ్మడి రాజధానిలో సినిమా పరిశ్రమ మూడేళ్లు వుండటం నేరమా? ఇలాటి ఆలోచనలూ అభ్యంతరాలూ ఎందుకు వచ్చినట్టు?
అప్పటి పత్రికలు కూడా మద్రాసు నుంచి విజయవాడ రావడానికి దశాబ్దాలు పట్టింది. ప్రజాశక్తి ఒక్కటే అక్కడ ముందుగా పున: ప్రారంభమైన పత్రిక. చాలా పత్రికలు హైదరాబాద్ కేంద్రాలు ప్రారంభించేందుకు కూడా దశాబ్దాలు పట్టింది. ఇప్పుడు కూడా ప్రధాన మీడియా సంస్థల కేంద్ర కార్యాలయాలు హైదరాబాదులోనే వున్నాయి. టీవీ మీడియా ఇప్పట్లో తరలి వెళ్లే ఆలోచనలు కూడా జరగడం లేదు. హిందీ ఛానళ్లన్నీ ఢిల్లీ ముంబాయిలలో తప్ప ఆయా రాష్ట్రాల రాజధానులలో ప్రధానంగా విజయవంతమైనవి చాలా తక్కువ. ఇలాటివి ప్రోత్సాహకాలు రాయితీలతో జరగాల్సిందే తప్ప ఉక్రోషాలూ ఆక్రోశాలు పనిచేయవు.