ఢిల్లీలో తెలుగు జర్నలిస్టులు భయంతో వణికిపోతున్నారు. వారి కుటుంబాలు టెన్షన్‌కు గురవుతున్నాయి. మొత్తం ముగ్గురు ఎలక్ట్రానిక్ మీడియా చానళ్ల ప్రతినిధులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మొదట ఓ టీవీ రిపోర్టర్‌కు నిర్ధారణ అయితే.. వెంటనే.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ తర్వాత వైరస్ నిర్ధారణ అయిన ఇద్దరికి చికిత్స అందించడానికి ఏ ఆస్పత్రిలోనూ బెడ్లు దొరకలేదు. మొదట ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. ఢిల్లీ ప్రభుత్వం సంగతి సరే సరి… తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. ఈ విషయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి తెలియడంతో.. ఆయన అధికారులతో మాట్లాడి.. ఎలాగోలా.. హర్యానా ఎయిమ్స్‌లో ఇద్దరు జర్నలిస్టులకు బెడ్లు ఏర్పాటు చేయించారు.
ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న విషయం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం… స్పందించింది. కేటీఆర్ ప్రత్యేకంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో మాట్లాడారు. జర్నలిస్టుల కోసం రూ. 12 లక్షలు విడుదల చేశారు. వైరస్ బారిన పడిన ముగ్గురు జర్నలిస్టులకు తక్షణ సాయంగా రూ. 75వేలు అందించాలని ఆదేశించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా సాయం చేశారు. ఆ తర్వాత ఏపీ సర్కార్ కూడా స్పందించింది. తాము కూడా ఏపీ భవన్ అధికారులతో సంప్రదించామని.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో తెలుగు జర్నలిస్టులకు చికిత్స అందించేలా ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేయించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించింది.
ప్రభుత్వాలు చేసే ప్రకటనలకు.. చేయాల్సిన చేతలకు మధ్య చాలా తేడా కనిపిస్తూండటంతో.. వైరస్ సోకితే తమను పట్టించుకునేవారే ఉండరన్న భయంతో ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు ఆందోళనకు గురవుతున్నారు. ఇద్దరు జర్నలిస్టులకు చికిత్సకు చేర్చుకోవడానికే.. ఉపరాష్ట్రపతి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యాలు మామూలుగానే అంతంతమాత్రం స్పందనతో ఉంటాయి. రిపోర్టర్లు కాబట్టి.. రాజకీయ నేతలు ఫేవర్ చేయాలి. వారు కూడా.. చెప్పుకోవడానికే ఎక్కవ ప్రాధాన్యం ఇస్తున్నారు.. చేయడానికి కాదు.అక్కడే సమస్య వస్తోంది..!