కార్తీ కథానాయకుడిగా నటించిన `ఖైదీ` మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో డబ్బింగ్ రూపంలో వచ్చి ఇక్కడ కూడా మంచి వసూళ్లు అందుకుంది. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. `ఖైదీ` హిట్ అవ్వగానే `ఖైదీ 2`కి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఓ ఖైదీ జైలు నుంచి విడుదలైన రోజు రాత్రి ఏం జరిగిందన్నది `ఖైదీ` కథ. అయితే ఆ ఖైదీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ `ఖైదీ 2`లో చూపించబోతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఖైదీకి ప్రీక్వెల్.
ఈ ఖైదీ 2 ని తెలుగు ప్రేక్షకులకు మరింత నచ్చేలా తీర్చిదిద్దడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఖైదీ లో కార్తి తప్ప.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటీనటులెవరూ ఉండరు. సినిమా మొత్తం తమిళ ధోరణిలోనే సాగుతుంది. అయినా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ చిన్నపాటి లోటుపాట్లు కూడా ఈ సీక్వెల్ లో ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సీక్వెల్ లో తెలుగు నటీనటులకు తగిన స్థానం ఇవ్వాలనుకుంటున్నారు. ముఖ్యంగా కార్తి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కీలకమైన ఓ పాత్ర కోసం ఓ తెలుగు యువ కథానాయకుడ్ని ఎంచుకుంటారని తెలుస్తోంది. ఈ పాత్ర కథకు చాలా కీలకమని తెలుస్తోంది. `ఖైదీ`లో కథానాయిక లేదు. ఆ అవసరమే రాలేదు. అయితే సీక్వెల్ లో మాత్రం కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పాత్రలోనూ తెలుగు చిత్రసీమకు బాగా పరిచయమున్న నాయికనే తీసుకోవాలని భావిస్తున్నారు. త్వరలోనే నటీనటుల వివరాల్ని అధికారికంగా వెల్లడిస్తారు.