తమిళ దర్శకులు తెలుగులో తమ హవా చూపించడం చాలా సాధారణమైన విషయం. ఇప్పుడైతే వాళ్ల డిమాండ్ మరింత పెరిగింది. కొంతమంది తెలుగు హీరోలు ఏరి కోరి తమిళ దర్శకుల్ని ఎంచుకుంటున్నారు. తమిళంలో ఒకటీ అరా హిట్లు ఇచ్చిన వాళ్లకీ ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. `మీరు కథ చెబితే చాలు` అన్నట్టు.. వాళ్ల చుట్టూ తిరుగుతున్నారు తెలుగు హీరోలు. కానీ అందరూ ఒకేలా ఉండరు కదా? ఓ తమిళ దర్శకుడితో తెలుగు హీరో ఆడేసుకున్నాడు. కథ చెప్పడానికి వస్తే – వార్నింగ్ ఇచ్చి పంపాడట. వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల ఓ కుర్ర హీరోతో ఓ తమిళ దర్శకుడి సినిమా ఓకే అయ్యింది. షూటింగ్ కూడా మొదలైంది. అయితే.. అంతకు ముందు నుంచీ ఆ కథ పట్టుకుని ఇండ్రస్ట్రీలో తిరుగుతూనే ఉన్నాడు ఆ దర్శకుడు. ఓ అగ్ర హీరో అప్పాయింట్ మెంట్ పట్టుకుని కథ చెప్పాడు. అయితే.. ఆ కథలోని కొన్ని సన్నివేశాలు హీరోకి కోపం తెప్పించేలా ఉన్నాయట. ఓ సన్నివేశంలో మహిళల్ని కాస్త కించపరిచేలా సాగే సరికి… హీరోకి చిర్రెత్తుకొచ్చిందట. `మళ్లీ నా కంటికి కనిపించకు.. కనిపించావో..` అంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చి వదిలాడని టాక్. ఆ దెబ్బకు ఆ హీరో పేరు చెబితేనే సదరు దర్శకుడు గజగజలాడుతున్నాడని టాక్. అంతేకాదు.. `తమిళ దర్శకుల్ని నా దగ్గరకు అస్సలు పంపొద్దు. తెలుగులో దర్శకులకు కరువొచ్చిందా` అంటూ మేనేజర్‌కి సైతం గట్టిగా చెప్పాడట. కాస్త కటువుగానే ఉన్నా, లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించడంలో ఇదో స్టైలేమో..?