దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో అసహ్యకరంగా జరుగుతున్న పరిణామాలతో… టాప్ టూ అధికారులిద్దర్నీ… ప్రధాని బలవంతంగా సెలవులో పంపారు. తాత్కలికంగా కొత్త సీబీఐ డైరక్టర్‌గా తెలగాణకు చెందిన మన్నెం నాగేశ్వరరావును నియమించారు. అర్థరాత్రి వరకూ.. ఉన్నతాధికారులతో ప్రధాని సమావేశం జరిపి… అలోక్ వర్మ, రాకేష్ అస్థానాల మధ్య వివాదం.. నేపధ్యంలో.. ఇద్దర్నీ సెలవులో పంపాలని నిర్ణయించారు. ఒడిశా కేడర్‌కు చెందిన నాగేశ్వరరావు 1986 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. గతంలో ఒడిశా డీజీపీగా కూడా పనిచేశారు. ఈయన స్వస్థలం వరంగల్ జిల్లా మంగపేట మండలం బోరెనర్సాపూర్ గ్రామం. ఏడాదిన్నరగా సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
విజయరామారావు తర్వాత తెలంగాణ అధికారికి సీబీఐ డైరెక్టర్ అవకాశం వచ్చింది. మన్నెం నాగేశ్వరరావు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సీబీఐ డైరక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సీబీఐపైనే సీబీఐ దాడులు చేయడంతో.. ఆ సంస్థ పరువు పోయింది. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరిస్తేనే దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ… రాజ్యాంగపరంగా… స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ పేరు నిలబడుతుంది. అలోక్, అస్థానా కేసులు.. ఇప్పుడు మన్నెం నాగేశ్వరరావు ముందు ఉన్న ప్రధాన చాలెంజ్. వాళ్లిద్దర్నీ బలవంతంగా లీవులో పంపినప్పటికీ.. వారికి ఉన్న బలమైన రాజకీయ మద్దతు ఉంది. నేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్థానాను.. ప్రధానమంత్రి నరేంద్రమోడీనే ఏరు కోరి నియమించుకున్నారని అందరికీ తెలుసు.
ఇప్పుడు వారిపైనే… మన్నెం నాగేశ్వరరావు విచారణ చేయాల్సి ఉంది. ఆయా కేసుల్లో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరం. నిజానికి సీబీఐ కేసులతో… ప్రతిపక్ష పార్టీలకు.. చెమటలు పట్టించడం కేంద్రం నైజం. కానీ ఇప్పుడు.. అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాల కేసు.. కేంద్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అలోక్ వర్మ, అస్తానాలు ఇద్దరిపై ఉన్న ఆరోపణలు.. వెలికి తీస్తే… లంచాల వ్యవహారమే కాదు.. రాజకీయ కుట్ర కూడా బయటకు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే అందరి దృష్టి ఇప్పుడు మన్నెం నాగేశ్వరరావుపై పడింది.