అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అమెరికాలో 350 భాషల్ని మాట్లాడే ప్రజలు ఉన్నారు. తెలుగు 11వ స్థానంలో తెలుగు భాష ఉంది. టాప్ టెన్ లో హిందీ, గుజరాతీ కూడా ఉన్నాయి. అంటే ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్లూ నివసించే అమెరికాలో అత్యధిక మంది మాట్లాడే భాషల్లో తెలుగు ఒకటిగా మారింది.
యూఎస్ సెన్సెస్ బ్యూరో డాటా ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 12 లక్షల 30 వేల మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. నిజానికి వీరి సంఖ్య ఏడేళ్ల క్రితం అంటే 2016లో కేవలం 3.2 లక్షలు మాత్రమే. ఏడేళ్లలో ఈ సంఖ్య పన్నెండు లక్షలు దాటిపోయింది. తెలుగు ప్రజలు అత్యధికంగా కాలిఫోర్నియాలో ఉంటున్నారు. ఆ రాష్ట్రంలో రెండు లక్షల మంది తెలుగు మాట్లాడే ప్రజలుంటారు.తర్వాత టెక్సాస్ లో లక్షన్నర మంది, న్యూజెర్సీలో లక్షా పదివేల మంది , ఇలినాయస్ లో 83 వేలు, విర్జీనియాలో 78 వేలు, జార్జియాలో 52 వేల మంది ఉంటున్నారు.
ప్రతి ఏడాది పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి చదువుల కోసం అమెరికా వెళ్తున్నారు. వచ్చిన వారిలో 75 శాతం మంది అక్కడే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. డాలస్ నగరంలో ఎక్కడ చూసినా ఇండియన్స్ ముఖ్యంగా తెలుగువాళ్లే కనిపిస్తారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే.. వచ్చే కొన్నేళ్లలో అమెరికా ప్రజలు మాట్లాడే టాప్ టెన్ భాషల్లో తెలుగు చేరే అవకాశాలు ఉన్నాయి. కొన్ని తరాలుగా అక్కడే స్థిరపడుతున్న తెలుగువారి సంఖ్య పెరుగుతోంది.