పవన్ కళ్యాణ్ ప్రసిద్ధ నటుడు గనక ఆకర్షణ ఎక్కువ అనేది నిజమే గాని తెలుగు మీడియా ఆయన పర్యటనకు ప్రసంగాలకూ ఇస్తున్న ప్రాధాన్యతలో పదోవంతైనా ప్రతిపక్ష నేత జగన్కు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పవన్ పర్యటన తర్వాత ఈ తేడా మరింత కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. గంటల తరబడి ప్రత్యక్ష ప్రసారాలు పేజీల నిండా వార్తలు ఇందులో పావు భాగమైనా ప్రతిపక్ష నేత పాదయాత్ర నోచుకోదా? ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన తర్వాత ఎపిలో జరిగిన ఏ ఘటనకూ ఇవ్వని ప్రాధాన్యత నిచ్చి ఆంధ్రజ్యోతి పూర్తి పేజీ ప్రచురించింది. అయినా పవన్ కళ్యాణ్ రాధాకృష్ణపై వ్యాఖ్యలు చేయడం మరో విచిత్రం. బహుశా ఇది వూహించబట్టే సాక్షి తరపున కొమ్మినేనిశ్రీనివాసరావు జగన్ను సుదీర్ఘ ఇంటర్వ్యూ చేసి ప్రచురించారు. అందుకోసం సాక్షిలో ఎడిట్పేజి ఎత్తివేయడం మరో దుస్సాంప్రదాయం. ఇంతచేసినా ఇది సాక్షికే పరిమితం. పైగా జగన్ ఇంటర్వ్యూలో పవన్ మాటల్లో వుండే మెరుపులు వివాదాస్పద అంశాలు విమర్శలకు సమాధానాలు లేవు గనక చప్పగా ముగిసింది. ఆ తర్వాత ఎన్టివి ప్రతినిధి జగన్తో ఫేస్ టు ఫేస్జరిపి వ్యాఖ్యలుగా ప్రసారంచేశారు. ఏమైనా నెల రోజుల జగన్ యాత్రకు రాని ఫోకస్ మూడు రోజుల పవన్ పర్యటనకు రావడం మన మీడియా ప్రస్తుత దశకు దర్పణం. ఎవరితప్పులూ ఒప్పులూ ఏమిటన్నది మరో ప్రశ్న.