బిజెపి జనసేన జైత్రయాత్ర పేరిట ఈ రోజు తిరుపతిలో భారీ సభ నిర్వహించాయి బిజెపి జనసేన పార్టీలు. వేలాది మంది జనం ఈ సభకు వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ పై పదునైన విమర్శలు చేశారు. అయితే ఈ ప్రోగ్రాం అంతటినీ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా మాత్రమే తెలుసుకోవలసి వచ్చింది. ఏదైనా ఊరిలో 100 మంది గుమికూడితే వార్తగా ఇచ్చే ప్రధాన చానల్స్ అన్ని, వేలాది మంది హాజరైన ఈ కార్యక్రమాన్ని పూర్తి గా పక్కన పెట్టేశాయి. వివరాల్లోకి వెళితే..
పవన్ కళ్యాణ్ సభ లని, స్పీచ్ ల ని ప్రధాన ఛానెల్స్ పక్కన పెట్టడం ఇవాళ కొత్తేమీ కాదు. ఉన్న ఛానెల్స్ లో సగం టీడీపీ కి పూర్తి అనుకూలంగా, మరి కొన్ని ఛానెల్స్ అధికార వైఎస్సార్సీపీ కి అనుకూలంగా నడుచుకుంటూ ఉంటాయి అన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇకపోతే మిగిలిన చానల్స్ ని కూడా అధికార పార్టీ నేతలు – కుదిరితే ప్రలోభపెట్టడం, లేదంటే బెదిరించడం ద్వారా జనసేన వాణి ప్రజల్లోకి వెళ్లకుండా బలంగా కృషి చేస్తున్నారు అన్న అభిప్రాయం జనసేన అభిమానుల లో ఉంది. తాజాగా ఇవాళ జరిగిన సభని ప్రధాన చానల్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం కూడా ఇదే కోవలోకి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కీలకమైన సమయంలో తెలుగు చానల్స్ తమను భారీగా దెబ్బతీశాయి అని వారు భావిస్తున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తమ పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జనసైనికులు కష్టపడుతున్నారు. జన సేన అధినేత ఉపన్యాసాలు ప్రజల్లోకి వెళితే తమ పార్టీకి ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతోనే అధికార పార్టీ నేతలు ఈ విధంగా చేస్తున్నారని జనసేన అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
1999లో వచ్చిన ఒకే ఒక్కడు అన్న సినిమాలో ఒక జర్నలిస్టు ముఖ్యమంత్రిని ని ప్రశ్నించే సన్నివేశానికి అప్పట్లో ప్రేక్షకులు విజిల్స్ వేశారు. 2018 లో వచ్చిన భరత్ అనే నేను సినిమా లో ఒక ముఖ్యమంత్రి మీడియా ఛానల్స్ కు, పత్రికలకు గడ్డి పెట్టే సన్నివేశానికి ప్రేక్షకుల నుండి అంతకంటే ఎక్కువ స్పందన వచ్చింది. గత రెండు దశాబ్దాలలో జర్నలిజం విలువలు ఎంత దారుణంగా పడిపోయాయి అనే దానికి ఒకరకంగా ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఏది ఏమైనా అధికారంలో ఉన్న పార్టీ ప్రలోభాలకు , లేదంటే బెదిరింపులకు మీడియా తలొగ్గడం ప్రజాస్వామ్యంలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నది వేచి చూడాలి.