సొంత పైత్యాన్ని జనాలపైన రుద్దడంలో మన తెలుగు మీడియా తర్వాతే ఎవరైనా. నిజానిజాలతో అస్సలు పనిలేదు. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ రాజకీయ స్వార్థ దృక్కోణం నుంచో, లేక ప్రేక్షకుల అటెన్షన్‌ని డ్రా చేయడం కోసమో…వాళ్ళకు నచ్చినట్టుగా వార్తలను వండేస్తూ ఉంటారు. తెలుగులో నంబర్ ఒన్ పత్రిక అని చెప్పుకునే ఈనాడుతో సహా మెయిన్‌స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ఒక వార్తను తెలుగు ప్రజలకు అందించింది. ఈనాడు వారైతే అందరికంటే ఒకడుగు ముందుకేసి మరీ తమకు నచ్చిన అర్థాన్ని చెప్పేశారు. తెలుగును మరోసారి తెలుగువాళ్ళకు నేర్పిస్తున్నాం, తెలుగు భాషను బ్రతికిస్తున్నాం అనే స్థాయిలో చెప్పుకునేవాళ్ళు కాస్తా…ఈ రోజు వాళ్ళకు తోచినట్టుగా రజినీకాంత్ ‘శక్తి’ అనే పదానికి ‘అధికారం’ అన్న అర్థం చెప్పేశారు.
‘సెల్’ అనే పదానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, పొలిటికల్ సైన్స్….ఇలా ఒక్కో సబ్జెక్ట్‌లో ఒక్క అర్థం చెప్తున్నారు అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక జోక్ సర్క్యులేట్ అవుతూ ఉంది. ఈ రోజు మన మీడియావాళ్ళు చేసింది కూడా అదే. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన రజినీకాంత్ ‘శక్తి’ గురించి మాట్లాడారు. డబ్బు ముఖ్యం కాదు అని చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మిక సభలలోనూ, పుస్తకాల్లోనూ అందరూ చెప్పిన మాటలనే తనదైన శైలిలో చెప్పారు రజినీకాంత్. కానీ మన మీడియాకు మాత్రం రజినీకాంత్‌గారు రాజకీయ శక్తి గురించి, అధికారం గురించి మాట్లాడినట్టుగా వినిపించింది. అప్పుడే తమిళనాడు ప్రజలందరూ కూడా రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి చర్చోపచర్చలు జరుపుతున్నట్టుగా రాసిపడేశారు. చిరంజీవి పొలిటికల్ తెరంగేట్ర సమయంలో కూడా ఇలానే వార్తలు వండారు మన మీడియావాళ్ళు. ఆ వార్తలను పట్టుకుని రాజకీయ నిరుద్యోగులందరూ చిరంజీవిని ఉబ్బేసి ఆయన చేత పార్టీ పెట్టించారు. పెద్ద పెద్ద రాజకీయ నిరుద్యోగులు, మీడియావాళ్ళందరూ కూడా చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పుణ్యమాని బాగానే బాగుపడ్డారు. కానీ చివరాఖరికి మాత్రం చిరంజీవికి ‘పొలిటికల్ బఫూన్’ సినిమా చూపించారు. ఇప్పుడు రజినీకాంత్ విషయంలో మీడియా అలాంటి అత్యుత్సాహమే ప్రదర్శిస్తోంది. తమిళనాట ఎంట్రీ కోసం బిజెపి కూడా రజినీని వాడుకోవాలన్న ప్రయత్నాల్లో ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగమే ఈ మీడియా తాళింపులు కూడా. రజినీకాంత్ మాటలకు పొలిటికల్ టచ్ ఇవ్వాలన్న ప్రయత్నం కాకపోతే……మనీలాంటి భౌతికమైన విషయాలకు కాదు….ఆధ్మాత్మిక శక్తికి ప్రాధాన్యతనివ్వాలని రజినీ చెప్తే……..ఈ మీడియావాళ్ళందరికీ కూడా రాజకీయ అధికారం అని వినపడడమేంటి….మరీ విడ్డూరం కాకపోతేనూ……