తమిళనాడులో జల్లికట్టు రచ్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు నో చెప్పినప్పటికీ, జల్లికట్టు వుండాల్సిందే, ఇది తమిళుడి సాంప్రదాయం అంటూ సెంటిమెంట్ ను రగిలించేశారు కొందరు. ఇది ఎప్పటినుండో జరుగుతున్న తంతే. అయితే ఈసారి సెంటిమెంట్ కాస్త అతిగా ప్రదర్శిస్తున్నట్లు కనబడుతుంది. అసలే సెంటిమెంట్లతో ఊగిపోయే తమిళ తంబీలు ఇపుడు ‘మాస్ హిస్టరీయా’ పట్టుకున్నట్లు రోడ్డుమీదకు వచ్చేశారు. దీనికి రాజకీయ పార్టీలు, సినీ సెలబ్రిటీలూ తోడయ్యారు. ముందే చెప్పుకున్నాం కదా మాస్ హిస్టరీయా అని. మనకెందుకులే అని ఊరుకుంటే ఎక్కడ వ్యతిరేక ముద్రపడుతుందో అని ఒకరిని చూసి ఒకరు రోడ్లపైకి వచ్చేశారు. కమల్ హాసన్ స్టేట్మెంట్,అది విని రజనీకాంత్, విజయ్ .. ఇలా ఎవరికి వారు జల్లికట్టుకు అనుకూలంగా మద్దత్తు తెలిపేశారు. అటు రాజకీయా నాయకులు కూడా కావలసినంత రాజకీయం చేసుకుంటున్నారు.
అయితే ఇప్పుడీ వివాదాన్ని తెలుగు మీడియా కవర్ చేస్తున్న విధానం చూస్తుంటే ఒక్కింత విచిత్రంగా అనిపిస్తుంది. అదేదో జాతీయ సమస్య అయినట్లు కలరింగ్ ఇస్తూ..జల్లి కట్టు.. జల్లి కట్టు.. అంటూ మోత మోగిస్తున్నాయి తెలుగు మీడియా ఛానళ్ళు. పక్క రాష్ట్రం సంప్రాదాయాలు, అందోళనల పై తెలుగు మీడియా పడుతున్న దిగులు చూస్తుంటే ముచ్చటేస్తుంది మరి. తెలుగు రాష్ట్రాల్లో మరే సమస్యలు లేనట్లు.. కేవలం జల్లికట్టు చుట్టే కవరేజీలు , స్టోరీ బోర్డులు,మ్యాగిజైన్ స్టోరీలు దంచికొడుతున్నాయి ఛానళ్ళు. దీనిపై అక్కడ ఏ చిన్న సెలబ్రీటి స్పందించినా దాన్ని బ్రేకింగ్ న్యూస్ గా ఇచ్చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే తెలుగు మీడియా ఛానళ్ళకు కూడా ‘మాస్ హిస్టరీయా’ పట్టుకుందేమో అనిపిస్తుంది.
మనం ప్రజాస్వామ్యంలో వున్నాం. న్యాయ స్థానాలది అంతిమ తీర్పు. దాన్ని గౌరవించడం తప్పనిసరి. అయితే ఇపుడు దీనికి విరుద్దంగా తమిళనాట అందోళన పర్వం నడుస్తుంది. జల్లికట్టు తమిళుల సాంప్రదాయమే. సంక్రాంతి సంబరాలలో ఎద్దులకు పూజలు చేసి వాటిని మచ్చిక చేసుకునే ఓ ఆట ఇది. అయితే దిన్ని క్రమంగా స్పెయిన్ లో జరిగిగే బుల్ ఫైట్ మోడల్ లోకి తీసుకొచ్చారు కొందరు. దీనిపై ‘పెటా’ లాంటి సంస్థలు కోర్టుకు వెళ్ళాయి. కోర్టు నిషేధం విధించింది. ఇప్పుడా సాంప్రదాయం ముసుగులో అక్కడ హద్దులు మీరిన ఆందోళనలు జరుగుతున్నాయక్కడ. ఇపుడా రచ్చను మరీ ఓవర్ గా కవర్ చేస్తోన్నరేమో అనిపిస్తుంది తెలుగు మీడియా వ్యవహారం చూస్తుంటే.