విడుదల కాని చిన్న, మీడియం సైజు సినిమాలకు ఓటీటీ సంస్థలు గాలాలు వేస్తున్న రోజులివి. `థియేటర్ల కోసం ఎదురు చూడకుండా ఓటీటీలోనే మీ సినిమాల్ని విడుదల చేసుకోవడం మంచింది` అంటూ సలహాలు వినిపిస్తున్న సందర్భం ఇది. కొంతకాలం ఎదురు చూద్దామా? లేదంటే ఓటీటీలో సినిమాని విడుదల చేసుకుందామా? అని నిర్మాతలు తర్జన భర్జనలు పడుతున్నారు. ఈలోగా.. ఓ సినిమా ఓటీటీలో ఆడడానికి రెడీ అయ్యింది. అదే `అమృతారామమ్`. ఈనెలాఖరున జీ 5 లో ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. ఓటీటీలో నేరుగా విడుదల అవుతున్న తొలి సినిమా ఇదే అంటూ ప్రచారం కూడా జరుగుతోంది.
నిజానికి… ఇది ఓటీటీ కోసం తీసిన సినిమా కాదు. థియేటర్ కోసమే తీశారు. ఓటీటీ లో ప్రదర్శించుకోవడానికి జీ 5కి ఈ సినిమాని అమ్మేశారు. థియేటర్లో విడుదలైన 30 రోజుల తరవాత ఈ సినిమాని ప్రదర్శించుకునేందుకు అన్ని హక్కులూ కల్పిస్తూ ఒప్పందం కుదిరింది. అయితే… ఇందులోనే మరో షరతు కూడా జోడించారు. ఒకవేళ సినిమా ఎలాంటి కారణాలతోనైనా విడుదల కాని పక్షంలో 100 రోజుల తరవాత ఓటీటీలో ప్రదర్శించుకోవడానికి వీలుగా ఒప్పందం కుదిరిందట. 100 రోజుల్లోపు సినిమా ఎందుకు విడుదల కాదు? అనుకున్నారేమో దర్శక నిర్మాతలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. కానీ సడన్గా.. లాక్ డౌన్ వచ్చి పడింది. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఒప్పందం ప్రకారం జీ 5లో విడుదలకు ముందే ప్లే అయిపోతోంది. ఈ సినిమాకి 2.5 కోట్ల బడ్జెట్ అయ్యిందని టాక్. ఓటీటీ ద్వారా నిర్మాతలకు 60 లక్షలకు మించి రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.