సంక్రాంతి సీజన్లో ఏయే సినిమాలు రాబోతున్నాయన్న విషయంలో మూడు నెలల ముందే క్లారిటీ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే… సంక్రాంతి చాలా కీలకమైన సీజన్. వీలైనన్ని ఎక్కువ సినిమాలు విడుదల చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. భారీ వసూళ్లకు అవకాశం ఎక్కువ. అందుకే ఈ సీజన్‌పై నిర్మాతలు దృష్టి పెడుతుంటారు. అయితే 2025 సంక్రాంతి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సీజన్లో ఎన్ని సినిమాలు వస్తాయో అర్థం కాక గందరగోళం నెలకొంది. ఈ సీజన్లో దాదాపు 6 సినిమాలు రాబోతున్నాయన్న అంచనా ఉంది. కాకపోతే.. ఒక్క ‘గేమ్ ఛేంజర్’ తప్ప ఎవరూ ఇప్పటి వరకూ రిలీజ్ డేట్ ప్రకటించలేదు.
ఈ సీజన్లో కేవలం 3 సినిమాలే రాబోతున్నాయని, అందుకే సంక్రాంతి సినిమాల మధ్య పెద్ద పోటీ ఉండదని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. గేమ్ ఛేంజర్, బాలయ్య సినిమా, దాంతో పాటు తమిళం నుంచి వస్తున్న ‘గుడ్ బాడ్ అగ్లీ’ ఇవి మాత్రమే రేసులో ఉన్నాయన్నది నాగవంశీ అభిప్రాయం కావొచ్చు. అయితే వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా కూడా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని పెట్టే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి సీజన్‌పై నిర్మాత దిల్ రాజు ఎంత గురి పెట్టారన్నది ఈ టైటిల్ ని బట్టే అర్థం అవుతోంది. సందీప్ కిషన్ ‘మజాకా’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘వామన’ కూడా ఈ సంక్రాంతికి రావాలని భావిస్తున్నాయి. ‘తండేల్’ కూడా సంక్రాంతికే విడుదలయ్యే అవకాశం ఉందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ గేమ్ ఛేంజర్, బాలయ్య సినిమా, వెంకీ ప్రాజెక్ట్, తండేల్ ఇవన్నీ వచ్చేస్తే అప్పుడు ‘మజాకా’, ‘వామన’ వాయిదా పడతాయి. ఎటు చూసినా దాదాపు అరడజను సినిమాలు తేలుతున్నాయి.
కానీ నాగవంశీ లెక్క వేరు. సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ విడుదల అవుతుంది. కాబట్టి దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే వెంకీ సినిమా వాయిదా వేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘తండేల్’ భారీ బడ్జెట్ సినిమా. దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టారు. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు రావడం సహజం. లాభసాటి కూడా. కానీ.. దిల్ రాజు, నాగవంశీ.. ఇద్దరూ ఈ సినిమాని వాయిదా వేసేలా అల్లు అరవింద్ ని ఒప్పించే ఛాన్సులు ఉన్నాయి. అసలు నిర్మాతలంతా కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రావడం కంటే, తక్కువ సినిమాలు విడుదల చేసుకొని, ఎక్కువ వసూళ్లు రాబట్టుకోవడం ముఖ్యం. ప్రతీ సంక్రాంతికి కనీసం 4 సినిమాల విడుదలకు ఛాన్సుంది. నాలుగు సినిమాలైతే థియేటర్లూ సర్దుబాటు చేయొచ్చు. ఇంకా ఎక్కువ సినిమాలొస్తే.. వాళ్లలో వాళ్లు పోటీ పడి, వసూళ్లకు గండి పడే ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయంలో ఎలాంటి గందరగోళాలకూ అవకాశం ఇవ్వకుండా నిర్మాతలంతా ఓ నిర్ణయానికి వీలైనంత త్వరగా వస్తే మంచిది.