ప్రముఖ తెలుగు ఛానల్ ఎన్టివి ఈ వారం నుంచి ఉదయం 7.30 లైవ్‌షో ఆపేసింది. అవకాశాన్ని అవసరాన్ని బట్టి సాయంత్రం డిబేట్ చేయొచ్చన్నది వారి ఆలోచనగా వున్నట్టు కనిపిస్తుంది. బాగా పేరు తెచ్చిన కెఎస్ఆర్ లైవ్‌షో కొమ్మినేని నిష్క్రమణ తర్వాత వట్టి లైవ్ షోగా మారింది. ఇప్పుడాయన సాక్షిలో చర్చలు చేస్తున్నా సహజంగానే సంస్థాగత పరిమితులు ఏర్పడ్డాయి. మహాటీవీలో పనిచేసి వచ్చిన మిత్రుడు రుషి ప్రధానంగా ఎన్టివి చర్చ నిర్వహిస్తున్నారు. రేటింగులో తగ్గుదల వున్నా ఎన్టివి డిబేట్ చూస్తున్నారనే మొదటినుంచి పాల్గొంటున్న మా వంటి వారికి అర్థమవుతుంటుంది. అయినా కొద్ది కాలంగా ఇది ఆగిపోవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పుడు జరిగిపోయింది కూడా. టీవీ9లో కూడా ఉదయం డిబేట్ టీవీ 1కు మారింది. . వెంకట కృష్ణ ఎపి24/7విజయవాడ నుంచి చర్చలు చేస్తున్నది. తన లెప్ట్ రైట్ చర్చ సాయికి ఇచ్చి ఆయన ఉదయం పూట చేస్తున్నారు.మహాటీవీలో మూర్తి సిఇవోగా ప్రవేశించిన తర్వాత చాలా మార్పులే వస్తున్నాయి. ఉదయం డిబేట్‌పై ఆయన ప్రణాళిక ప్రత్యేకంగా వుంది మొత్తంపైన తెలుగు ఛానళ్ల చర్చల సరళిలోనూ సమయాల్లోనూ పెద్ద మార్పులే రాబోతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యం, ఎన్నికలు రానున్న భవిష్యత్తు ఇందుకు కారణమవుతున్నాయి. ఆపైన వ్యక్తులూ వ్యవస్థల ప్రభావం వుండనే వుంటుంది.