టీవీ చానళ్ల రేటింగ్ వ్యవస్థలో దూరి మొత్తం నాశనం చేసిన వారి గురించి కొద్ది కొద్దిగా బయటకు వస్తోంది. ఇది నిన్నటి వరకూ.. హిందీ, ఇంగ్లిష్ చానళ్ల వాళ్ల బరితెగింపు అనుకున్నారు. తెలుగు మీడియాలోని వ్యక్తులు ఏ మాత్రం తగ్గలేదని తాజాగా తేలింది. టీవీ చానళ్లకు రేటింగ్‌లు ఇచ్చే సంస్థ బార్క్ మాజీ చైర్మన్ పార్దోదాస్ గుప్తా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ముంబై పోలీసులు ఈ స్కాంపై విచారణ జరుపుతున్నారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ చానళ్ల రేటింగ్‌లనే కాదు.. ప్రాంతీయ చానళ్ల రేటింగ్‌లు కూడా ట్యాంపర్ చేసినట్లుగా తేలింది.
ఏబీఎన్, టీవీ ఫైవ్ లాంటి చానళ్ల రేటింగ్‌ను తగ్గించి టీవీ9, సాక్షి రేటింగ్ పెంచడానికి.. కుట్ర జరిగింది. కొన్ని తెలుగు చానళ్ల రేటింగ్‌ను అమాంతం పెంచి.. మరికొన్నిరేటింగ్స్ను మాత్రం తగ్గించారు. బార్క్ కొత్త కార్యవర్గం రేటింగ్స్ మొత్తాన్ని ఫోరెన్సిక్ అడిట్ చేయడంతో విషయం బయటపడింది. వీటికి సంబంధించిన ఈమెయిల్ సంభాషణలు కూడా వెలుగు చూశాయి. నిజానికి ఈ రేటింగ్ వ్యవహారాన్ని పార్ధోదాస్ హయాంలో బోగస్‌గా మార్చారు. కొన్ని చానళ్లను అదే పనిగా చూసేవారు లేకపోయినా ఎక్కువగా చూపించాలని ప్లాన్ చేశారు. ఇలా మొత్తంగా రిగ్గింగ్ చేసి తెలుగు ఛానల్స్ రేటింగ్స్‌ను 39 శాతం పెంచారు. అదే స్థాయిలో ఏబీఎన్ లాంటి చానళ్ల రేటింగ్‌ను తగ్గించారు. దీని వల్ల ఆయా చానళ్లు చాలా నష్టపోయాయి.
మొత్తంగా తెలుగు న్యూస్ టీవీ ఛానల్స్ రేటింగ్స్‌లోనూ రిగ్గింగ్ జరిగిందని ఫోరెన్సిక్ ఆడిట్ తేల్చింది. ప్రధానంగా ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న రెండు చానళ్ల రేటింగ్లను అనుకూలంగా రేటింగ్లను బార్క్ మార్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగులో కొన్ని మీడియా సంస్థల మెడకు చుట్టుకోనుంది. ముంబై పోలీసులు ఇప్పుడు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు.. మీడియాలోకి చొరబడిన తర్వాత అన్ని రకాల అవలక్షణాలు మీడియాకు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు రేగింగ్ రిగ్గింగ్ కూడా చేరింది. ముందు ముందు ఎన్ని వికారాలు బయటపడతాయో చెప్పడం కష్టం.