హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న పార్టనర్షిప్ సమ్మిట్ ఇవాళ విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, దేశ విదేశాలనుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలు, రాష్ట్రమంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు ప్రజలకు శ్రమించే తత్వం ఉందని అన్నారు. సమస్యలను అధిగమించే నాయకత్వం ఇక్కడ ఉందని చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమని భావించి ప్రజలకు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. రెవెన్యూలోటు ఉన్నా రాష్ట్రం 11 శాతం వృద్ధిని సాధించిందని అన్నారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటుందని చెప్పారు.
జైట్లీకి ముందు మాట్లాడిన చంద్రబాబు, ఏపీలో అపారమైన వనరులు ఉన్నాయని అన్నారు. దక్షిణాదిలో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రం ఏపీ ఒక్కటేనని చెప్పారు. తీరప్రాంతాల అభివృద్ధి, తయారీ పరిశ్రమల వల్లే చైనా ఎదిగిందని, అత్యధిక తీరప్రాంతం ఉన్న ఏపీకు ఆ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. 2022 నాటికి ఏపీ దేశంలోని మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటవుతుందని చెప్పారు. అనిల్ అంబానీ మాట్లాడుతూ, ఏపీలో శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని పెట్టుబడులకు అనువుగా ఉంటుందని అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని చెప్పారు.