తెలుగువాళ్లు అమెరికాలో ఎక్కడైనా సమస్యల్లో ఇరుక్కుంటే కొంత మంది తెలుగువాళ్లే చంకలు గుద్దేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా యాపిల్ కంపెనీ కొంత మంది ఉద్యోగులను తొలగించిన వ్యవహారంలోనూ అదే నడుస్తోంది. కేవలం తెలుగు వాళ్లు మాత్రమే అక్రమాలు చేశారని.. ఆ అక్రమాల్లో తెలుగు సంఘాలు ఉన్నాయని అందుకే తీసేశారని ప్రచారం చేసేస్తున్నారు. నిజానికి యాపిల్ కంపెనీ తీసేసిన ఉద్యోగుల్లో తెలుగు వారి సంఖ్య స్వల్పం. అక్కడ స్కామ్ ఏమీ జరగలేదు కానీ తమకు కల్పంచిన ఓ సౌకర్యాన్ని ఆ ఉద్యోగులు దుర్వినియోగం చేశారు.
యాపిల్ కంపెనీ తమ తమ ఉద్యోగులకు కల్పించే అనేకానేక సౌకర్యాల్లో స్వచ్చంద సంస్థలకు ఇచ్చే విరాళాలకు మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఉంటుంది. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఉద్యోగులు కొంత మొత్తం .. సేవా కార్యక్రమాలు చేసే లాభాపేక్ష లేని కంపెనీలకు విరాళం ఇవ్వొచ్చు. ఉద్యోగులు ఇచ్చే విరాళానికి కంపెనీ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. ఇలా యాపిల్ ఉద్యోగులంతా విరాళాలు ఇచ్చి..దానికి మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేయించుకుంటూ ఉంటారు. ఇలా చాలా మంది ఉద్యోగులు తీసుకున్న మ్యాచింగ్ గ్రాంట్ ను అసలు ఆయా సంస్థలకు ఇవ్వకపోవడమో.. ఇచ్చినా లోపాయికారీ ఒప్పందంతో వెనక్కి తీసుకోవడమో చేశారు. అంటే కంపెనీ ఇచ్చిన మ్యాచింగ్ గ్రాంట్ కోసం కక్కుర్తి పడ్డారు. ఈ విషయం తెలిసిన ఆపిల్ యాజమాన్యం విచారణ జరిపి ఇలా అవకతవకలకు పాల్పడ్డవారిని ఉద్యోగాల నుంచి తీసేసింది.
ఇలాంటి వారు దాదాపుగా రెండు వందల మంది ఉంటే తెలుగువారు ఓ ముఫ్పై, నలబై మంది ఉంటారు. కానీ అంతా తెలుగువారే చేశారన్నట్లుగా ప్రచారం చేసేస్తున్నారు. ఈ అంశంపై అమెరికా పోలీసులు కేసులు పెట్టారు. ఆరుగురు మాజీ ఆపిల్ ఉద్యోగుల్ని అరెస్టు చేశారు. వారంతా చైనీయులు. వారు కూడా ఇదే పని చేశారు. కక్కుర్తి పడిన ఉద్యోగుల్లో తెలుగువారు కూడా ఉన్నారు కానీ..తెలుగు వారు మాత్రమే లేదు. తెలుగు వారు తమ మ్యాచింగ్ గ్రాంట్ కక్కుర్తి కోసం.. రెండు తెలుగు సంఘాలను ఉపయోగించుకున్నారు. ఎఫ్బీఐ వారిపైనా కేసులు పెట్టనుంది.
ఇక్కడ మొత్తం వ్యవహారంలో ఒక్క తెలుగువాళ్లే.. తెలుగు వాళ్ల పరువు తీస్తున్నారని చెప్పి ప్రచారం చేయాల్సిన పని లేదు. అందరితో పాటు తెలుగు వాళ్లు కూడా కక్కుర్తి పడ్డారు. అలాంటి వాళ్లు శిక్ష అనుభవిస్తున్నారు. అంతే… దీనికి మొత్తం తెలుగు ప్రైడ్ ను జత చేయాల్సిన అవసరం లేదు.