ఈమధ్య తమిళ హీరోల దృష్టి తెలుగు సినిమాలపై పడింది. టాలీవుడ్ దర్శకుడితో, టాలీవుడ్ ప్రొడ్యూసర్‌తో జట్టు కట్టి… తమిళ హీరోలు నేరుగా తెలుగులో సినిమాలు చేసేసుకొంటున్నారు. దీని వల్ల ఆయా హీరోలు తెలుగులో కొత్తగా ఎంత మార్కెట్ సాధించారో తెలీదు కానీ.. ఈ ఈక్వెషన్ మన నిర్మాతలకే బాగా కలిసొస్తోంది.
శివ కార్తికేయన్‌తో ఏసియన్ ఫిల్మ్స్ సంస్థ ప్రిన్స్ చిత్రాన్ని రూపొందించింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. ఈ సినిమాతో నిర్మాతలకు ఏకంగా రూ.20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ మిగిలింది. వారసుడు విషయంలోనూ ఇదే జరిగింది. విజయ్ తొలిసారి ఓ తెలుగు దర్శకుడితో, తెలుగు నిర్మాతతో చేసిన సినిమా ఇది. విజయ్ నటించిన తొలి స్ట్రయిట్ సినిమా అని చెప్పుకొన్నా – చివరికి ఈ సినిమాని డబ్బింగ్ బొమ్మగానే గుర్తించారు జనాలు. అయినా దిల్ రాజుకి పోయిందేం లేదు. ఈ సినిమాతో డివైడ్ టాక్ వచ్చినా సరే, బాక్సాఫీసు దగ్గర మాత్రం దిల్ రాజు మంచి ఫలితాన్నే రాబట్టాడు. ఈ సినిమాతో లాభాలు దక్కించుకొన్నాడు.
ఇప్పుడు సార్ వంతు వచ్చింది. ధనుష్ చేసిన తొలి స్ట్రయిట్ సినిమా ఇది. 17న విడుదల అవుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమాకీ దాదాపుగా రూ.20 కోట్ల వరకూ మిగిలిందని టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈమధ్య స్వాతిముత్యం, బుట్టబొమ్మ లాంటి సినిమాలు తీసి నష్టపోయింది. ఆ నష్టాల్ని సార్ ఒంటి చేత్తో భర్తీ చేసేశాడు. శివ కార్తికేయన్ ప్రిన్స్, విజయ్ వారసుడు రెండూ తెలుగులో అంతంతమాత్రంగానే ఆడాయి. అయినా వాటిని నిర్మాతలు సొమ్ము చేసుకోగలిగారు. సార్ ఫలితం పెండింగ్ లో ఉంది. దీని రిజల్ట్ ఎలా ఉన్నా సరే. నిర్మాతలకు సొమ్ములు మిగిలాయి. సో… తమిళ హీరోల ఫార్ములా మన నిర్మాతలకు వర్కవుట్ అయినట్టే అనుకోవాలి.