బాబా సాహెబ్ అంబేద్కర్ … రాజ్యాంగ నిర్మాతగా, ఈ దేశం గర్వించదగిన మేధావిగా జాతి మొత్తం సదా ఆయనకు ప్రణమిల్లుతుంది. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాల్లో ఒకటిగా తీర్చిదిద్దిన కమిటీకి సారథ్యం వహించిన సమోన్నతుడిగా అందరూ ఆయనను గుర్తిస్తారు. ఆ రకంగా యావత్ భారత జాతి జీవనగమనం, జాతి ప్రస్థానం ఎలా పురోగమించాలో నిర్దేశించిన వ్యక్తి ఆయన. కానీ అవకాశ వాదులు మాత్రం ఆయనను ఒక దళిత బాంధవుడిగా మాత్రమే పరిగణించాలని తపన పడుతారు. రాజకీయ పార్టీలు అయితే మరీ చోద్యం.. అంబేద్కర్ ను ఒక ఓటర్లను ఆకట్టుకునే మార్కెటింగ్ ఎలిమెంట్ గా చూస్తూ ఉంటాయని అన్నా ఆశ్చర్యం గానీ, అతిశయోక్తి గానీ లేవు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రులూ ఇప్పుడు బాబా అంబేద్కర్ మీద వల్లమాలిన ప్రేమను కురిపిస్తున్నారు. చోద్యం ఏంటంటే.. ఇద్దరూ 125 అడుగుల అతిపెద్ద విగ్రహాన్ని తమ రాష్ట్రంలో స్థాపించి అంబేద్కర్ మీద తమలోని ప్రేమను చాటుకోవాలని తహతహ లాడిపోతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి ఈ విషయంలో ముందంజలో ఉన్నారని చెప్పాలి. గత బడ్జెట్ సమావేశాల సమయంలోనే రాజ్యాంగం- అంబేద్కర్ గురించిన చర్చ వచ్చినప్పుడు… నూతన రాజధాని అమరావతిలో 125 అడుగుల అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు శాసనసభలోనే ప్రకటించారు. అప్పటినుంచి దీనిమీద చర్చ నడుస్తోంది. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఇదే అవుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు.
అయితే తాజాగా ఉగాది పర్వదినం నాడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులో ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ 125వ జయంతి రాబోతున్నది. ఈ సందర్భంగానే చంద్రబాబునాయుడు కూడా అమరావతిలో 125 అడుగులు అనేది ఒక ప్రామాణికంగా భావిస్తూ.. ఆ ఎత్తుతో ఏర్పాటుచేస్తాం అని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే అంటున్నారు. కాకపోతే దీన్ని ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అవుతుందని ప్రకటిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి నాడే దీనికి శంకుస్థాపన కూడా చేయబోతున్నట్లు కేసీఆర్ వెల్లడించడం విశేషం.
ఇద్దరు చంద్రుల్లో పోల్చిచూస్తే కేసీఆర్ కు కాస్త ఎడ్వాంటేజీ ఉంది. అమరావతిలో చంద్రబాబు ఈ విగ్రహాన్ని తాను తలచుకున్నా సరే ఎప్పటికి ఏర్పాటు చేయగలరో, అసలు ఆ నగరం ఎప్పటికి నిర్దిష్టమైన రూపురేఖలు సంతరించుకుంటుందో సందేహమే. అలాంటి నేపథ్యంలో మరో వారంరోజుల్లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపనతో శ్రీకారం చుట్టేయబోనుండడం ఖచ్చితంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎడ్వాంటేజీ అని చెప్పాలి.