తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాజెక్టులను నిర్మించాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఎంత పట్టుదలగా అంటే…. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్టే ఇచ్చినా.. పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసినా.. పట్టించుకోకుండా పనులు చేసేంత పట్టుదలతో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ పట్టుదలే ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది. తెలంగాణలో కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు, ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులపై ఒకే సారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో పిటిషన్లు దాఖలయ్యాయి. రెండు పిటిషన్లను వేర్వేరు వ్యక్తులు దాఖలు చేశారు.
కాళేశ్వరం మూడో ఎత్తిపోతలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్టే ఇచ్చినప్పటికీ పనులు చేస్తున్నారని.. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని తుమ్మలపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. అలాగే రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంపై ఎన్జీటీ స్టే ఇచ్చినా… పనులు ప్రారంభించారని.. ఏపీ సర్కార్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని జి. శ్రీనివాస్ అనే మరో వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు పిటిషనర్లు ఆయా రాష్ట్రాలు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాయని పిటిషన్లో తెలిపారు. ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చేస్తున్న దృశ్యాలను పిటిషన్‌కు జత చేశారు. మీడియాను కూడా అనుమతించకుండా అక్కడ పనులు చేస్తున్నారని పిటిషనర్ చెబుతున్నారు.
డీపీఆర్‌లు సమర్పించిన తర్వాత.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోని నిర్మాణాలు చేపట్టాలని గతంలో కేంద్రం నిర్దేశించింది. అయితే ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడంలేదు. మరో వైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయిన రోజే… అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలిపివేయాలన్న లేఖను తెలంగాణ సర్కార్‌కు పంపారు. ఇప్పుడు ఆ రెండు ప్రాజెక్టులపై ఎన్జీటీలో పిటిషన్లు దాఖలవడం ఆసక్తికరంగా మారింది.