రాజధాని లేని రాష్ట్రంలో పాలన సాఫీగా చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమరావతి నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నుంచే పాలన మొదలైంది. హైదరాబాద్ నుంచి ఉద్యోగులు అమరావతి బాటపట్టారు. స్వరాష్ట్రం నుంచే సర్కారు పనిచేయడం దసరా నుంచే మొదలైంది. తెలంగాణలో మాత్రం అద్భుతమైన సచివాలయ భవనాన్ని కూల్చేసి కొత్తది కట్టడానికి కసరత్తు మొదలైంది.
ఇంకా కొన్ని దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా ఉపయోపడే సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్త భవన నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనికి కారణం వాస్తు దోషమో మరేమిటో ముఖ్యమంత్రే జవాబివ్వాలి.
ఏపీ సచివాలయం నుంచి ఫైళ్లను తీసుకుని ఉద్యోగులు వెళ్లిపోయారంటే అర్థం ఉంది. వాళ్లు స్వరాష్ట్రంలోపనిచేయడం మొదలుపెట్టారు. తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చితే అందులోని ఆఫీసులు ఎక్కడికి పోవాలి? ఉద్యోగులు ఎక్కడ కూర్చోవాలి? ఆ ప్రాంగణంలో ఉన్న ఫైళ్లు, ఫర్నిచర్, ఇతర పరికరాలను ఎక్కడ ఉంచాలి? అన్నీ ప్రశ్నలే.
ఆఫీసులను తాత్కాలికంగా వేరే భవనాలకు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ కే భవన్ ఇతర భవనాలను చీఫ్ సెక్రటరీ, జి ఎ డి అధికారులు పరిశీలించారు. గురువారం కూడా తగిన భవనాల కోసం అన్వేషణ కొనసాగించారు. ఏ భవనంలోనైనా ఇప్పటికే ఏదో ఒక ఆఫీసు ఉంటుంది. ఉద్యోగులు ఉంటారు. వాళ్ల ఫైళ్లు, పరికరాలు ఉంటాయి. మరి సచివాలయం నుంచి అదనంగా వచ్చే వారికి చోటు ఉంటుందా అనేది ప్రశ్న.
మొత్తానికి కొత్త సచివాలయం పూర్తయ్యే వరకూ ఇరుకిరుకుగానే ఉద్యోగులు కూర్చోవాల్సి ఉంటుందేమో. అలాంటప్పుడు ప్రశాంతంగా పనిచేయగలరా అనేది మరో ప్రశ్న. తగిన సదుపాయాలు లేకుండా సాఫీగా పనిచేయడం ఎవరికైనా సాధ్యం కాదు. ఉద్యోగులు రోబోలు కాదు. కాబట్టి వారికి కనీస సదుపాయాలు కల్పించడం తప్పనిసరి. ఇంత కష్టపడి, వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి వాస్తుకు అనుగుణంగా కొత్త సచివాలయాన్ని కట్టాలనే నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.