తెలుగోడు చెయ్యెత్తి జైకొట్టడం ఏమోగానీ, చిన్న సమస్యకే చేతులెత్తేస్తున్నాడు. చావే మార్గమనుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. దేశ వ్యాప్తంగా ఆత్మహత్య ఘటనల్లో రెండు తెలుగు రాష్ట్రాలూ మొదటి 10 స్థానాల్లో చోటు దక్కించుకోవడం మనకు గౌరవప్రదం కాదు. ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్యలో, ఆత్మహత్యల రేటులోనూ తెలంగాణ ఇంకా ముందుంది. ఏపీ కాస్త వెనుక ఉన్నా మొత్తానికి బలవన్మరణాల్లో పోటాపోటీగానే ఉన్నాయి.
తాజా గణాంకాల ప్రకారం, ఉమ్మడి రాష్ట్రంలో 2014లో 15,724 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2013తో పోలిస్తే 1117 ఆత్మహత్యలు పెరిగాయి. మొత్తం మీద చూస్తే, అక్షరాస్యత, తలసరి ఆదాయం, జీవనశైలి మెరుగ్గా ఉంటాయని భావించే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆత్మహత్యలు ఎక్కువ. వెనుకబడిన ఉత్తరాది రాష్ట్రాల్లో తక్కువ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మానసిక దౌర్బల్యంతో పాటు ఆత్మహత్యలు పెరగడం వెనుక ప్రభుత్వాల పాపం ఉంది.
ఓటు బ్యాంకు రాజకీయాల్లోంచి పుట్టుకొచ్చిన రాజకీయ విన్యాసాల కారణంగా తెలుగోడికి తెగుద తగ్గుతూ వచ్చింది. ప్రతిదానికీ ప్రభుత్వంపై ఆధారపడే లక్షణం పెరిగింది. ప్రభుత్వాలు కూడా ప్రజలు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో బతకడానికి బదులు, ప్రతిదానికి చేయిచాపడం అలవాటు చేశాయి. చివరకు, ఆత్మహత్యలకు ప్యాకేజీని ప్రకటించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. తమ బాధ్యతను సరిగా నిర్వర్తించడం చేతకాని ప్రభుత్వాలు, దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఓటు బ్యాంకు పథకాలు ప్రకటిస్తుంటాయి.
ఉదాహరణకు, సాగు నీటి సదుపాయం లేని రైతుకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం ప్రభుత్వ బాధ్యత. అప్పుడో గంట, ఇప్పుడో రెండు గంటలు కాకుండా నిర్ణీయ సమయంలో ఏకధాటిగా కరెంటు సరఫరా చేయాలి. అది చేతకాని ప్రభుత్వాలు, ఉచిత విద్యుత్తు తాయిలాలతో రైతులను మభ్య పెడతాయి. సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయాలి. అది కూడా సర్కారుకు చేతకాదు. వాటికోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయిన రైతులున్నారు. గుండెపోటుతో మరణించిన బక్కరైతులూ ఉన్నారు. ఇంతాచేసి, ఉచిత విద్యుత్తు వల్ల రైతు ఆత్మహత్యలు ఆగాయా అంటే అదీ లేదు.
రైతు రుణమాఫీ అనే మరో ఓటు బ్యాంకు పథకం కోసం రెండు తెలుగు రాష్ట్రాలూ వేలకోట్లు వెచ్చిస్తున్నాయి. అయినా రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. అంటే, రుణమాఫీ వల్ల ప్రయోజనం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే, వ్యవసాయ భూమి ఉన్న వారిలో 80 శాతం మంది వ్యవసాయం చేయరు. భూమిని కౌలుకు ఇస్తారు. భూమి పత్రాల మీద రుణం తీసుకుని ఇతర వ్యాపారాలకో వేరే అవసరాలకో ఉపయోగిస్తారు. నిజంగా వ్యవసాయం చేసే కౌలురైతులు స్థానికంగా ఉన్న వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేస్తారు. తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే రుణామాఫీ వల్ల రైతు ఆత్మహత్యలు ఆగటం లేదు. ఈ వాస్తవాన్ని కూడా ప్రభుత్వాలు గుర్తించడం లేదు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వితంతు, వికలాంగుల పెన్షన్ మొత్తాన్ని పెంచింది. ఇది అభింనదించాల్సిన విషయమే. వారితో పాటు బీడీ కార్మికులకూ పెన్షన్ ప్రకటించింది. నిజానికి వాళ్లు అడగలేదు. ఇక్కడ ప్రజలను బిచ్చగాళ్లను చేయడం అనే కోణం ఉంది. నిజానికి, బీడీ కార్మికులకు న్యాయంగా కూలీ రేట్లు పెంచడం, వారి పిల్లల స్కాలర్ షిప్ లను ఏటికేడూ పెంచడం… ఇదీ ప్రభుత్వం చేయాల్సిన పని. ఇది చేస్తే నెలకు వెయ్యి రూపాయల కంటే ఎక్కువే అవుతుంది. బీడీ కార్మికులు ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ఉంటుంది. వారు అధికంగా ఉన్న చోట ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, మందులు కచ్చితంగా ఉండేలా చేస్తే, పొగాకు ప్రభావంతో వచ్చే అనారోగ్యానికి పైసా ఖర్చు లేకుండా చికిత్స చేయించుకోవచ్చు. అప్పుడు ఆ డబ్బూ మిగులుతుంది. ఇవన్నీ లెక్కిస్తే నెలకు రెండు మూడు వేలు కలిసి వస్తాయి. అది ప్రభుత్వం చేయాల్సిన పని. అది చేయకుండా నెలకు వెయ్యి పెన్షన్ ఇస్తున్నామంటూ, ప్రజలు తమ ముందు చేయి చాపేలా చేసింది ప్రభుత్వం.